వైద్యం వికటించి మృతి చెందాడని ఆందోళన
వైరారూరల్: గ్రామీణ వైద్యుడు చేసిన వైద్యం వికటించడంతోనే విద్యార్థి మృతి చెందాడంటూ ఆయన కుటుంబీకులు ఆందోళనకు దిగారు. మండలంలోని గొల్లపూడికి చెందిన పసుపులేటి వెంకటరామయ్య కుమారుడు గోపి (19) మధిర మండలం కృష్ణాపురంలోని బీసీ వెల్ఫేర్ గురుకులంలో ఇంటర్ చదువుతున్నాడు. రెండు రోజుల కిందట ఇంటికి వచ్చిన గోపి బుధవారం చేతి వేళ్లపై గాట్లు ఉండడంతో తల్లిదండ్రులకు చెప్పడంతో వారు గ్రామీణ వైద్యుడు రాజారావు వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఆయన ఇంజక్షన్ చేసి సైలెన్ పెట్టాక గోపికి రియాక్షన్ కావడంతో వైరాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు సీపీఆర్ చేశారు. ఆయనకు ప్రాణం ఉన్నట్లు గ్రహించిన వైద్యుడు చికిత్స చేస్తుండగానే గోపి మృతి చెందాడు. కాగా, గ్రామీణ వైద్యుడి వైద్యం వికటించడంతోనే తమ కుమారుడు చనిపోయాడని గోపి కుటుబీకులు ఆయన మృతదేహంతో ఆర్‌ఎంపీ రాజారావు ఇంటి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేయనున్నట్లు ఎస్‌ఐ పుష్పాల రామారావు తెలిపారు.


