నేడు మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

Dec 17 2025 7:17 AM | Updated on Dec 17 2025 7:17 AM

నేడు

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం కూసుమంచి మండలంలో పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి ఇటీవల ఎన్నికై న సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులతో కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ తరఫున ఎన్నికై న వారు హాజరుకావాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్‌ తుంబూరు దయాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.

తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 1,023 కి.మీ. మేర రోడ్లు

ఖమ్మంమయూరిసెంటర్‌: తెలంగాణలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన(పీఎంజీఎస్‌వై), ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ పథకాల ద్వారా 1,023 కి.మీ. మేర రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్‌ పాశ్వాన్‌ వెల్లడించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఈ విషయమై ప్రశ్నించారు. దీనికి మంత్రి కమలేష్‌ సమాధానం ఇస్తూ.. ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ కింద తెలంగాణకు 146 రహదారి పనులు, 112 వంతెనలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 1,023 కి.మీ. నిడివికి గాను రూ.681.15 కోట్ల వ్యయంతో ఇప్పటివరకు 478 కి.మీ. మేర 39 రహదారులు, 50 వంతెనల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని తెలిపారు. ఇక 2016లో ప్రారంభించిన ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ పథకం ద్వారా తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల జిల్లాల్లో రహదారి అనుసంధాన పనులు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.

‘మీ డబ్బు, మీ హక్కు’పై ఈనెల 20న శిబిరం

ఖమ్మంవ్యవసాయం: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు ‘మీ డబ్బు, మీ హక్కు‘ అంశంపై ఈనెల 20న సదస్సు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలిపారు. క్లెయిమ్‌ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 20వ తేదీన ఉదయం 11నుంచి సాయంత్రం 4గంటల వరకు కలెక్టరేట్‌లో జరిగే శిబిరాన్ని క్లెయిమ్‌ చేసుకోని ఆస్తుల వాస్తవ యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఓ ప్రకటనలో సూచించారు.

ఉపాధి కోర్సుల్లో

ఉచిత శిక్షణ

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం టేకులపల్లిలోని జిల్లా మహిళా ప్రాంగణంలో వివిధ ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ప్రాంగణం మేనేజర్‌ వేల్పుల విజేత తెలిపారు. ఈ మేరకు 18 – 35 ఏళ్ల వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ తర్వాత మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. పదో తరగతి అర్హతతో రెండు నెలల పాటు కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్‌(సీహెచ్‌డబ్ల్యూ), కంప్యూటర్‌ కోర్సులు, ఎనిమిదో తరగతి అర్హతతో టైలరింగ్‌, బ్యూటీషియన్‌ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 20వ తేదీలోగా మహిళా ప్రాంగణంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కొనసాగిన రాష్ట్ర బృందం పరిశీలన

ఖమ్మం సహకారనగర్‌: ‘స్వచ్ఛ’ ఏవం హరిత విద్యాలయ రేటింగ్స్‌లో జిల్లా స్థాయికి ఎంపికై న ఎనిమిది పాఠశాలలను సోమవారం పరిశీలించిన రాష్ట్ర బృందం మంగళవారం తిరుమలాయపాలెం, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్‌ మండలాల్లో పర్యటించింది. ఆయా మండలాల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను పరిశీలించి ఎకో క్లబ్‌ కార్యక్రమాలు, పచ్చదనం పరిశుభ్రత, తాగునీరు, టాయిలెట్ల నిర్వహణ, విద్యార్థుల్లో పరిసరాలపై అవగాహన తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశీలకుడు సైదులుతో పాటు బాజోజు ప్రవీణ్‌ కుమార్‌, కొత్తగూడెం ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ సతీష్‌ కుమార్‌, స్వరూప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు మంత్రి పొంగులేటి పర్యటన
1
1/1

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement