ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే...
● సర్పంచ్‌లు విద్య, వైద్యరంగాలపై దృష్టి సారించాలి ● ఆత్మీయ సమ్మేళనంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
చింతకాని: 1970లో కాంగ్రెస్ ఏక పార్టీగా ఉన్నప్పు డు, 2004 వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పటి తర్వాత మళ్లీ ఇప్పుడే మధిర నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. నియోజకవర్గంలోని 131 స్థానాలకు 90 సర్పంచ్ స్థానాలను గెలవడం అభినందనీయమని తెలిపారు. చింతాని, ముదిగొండ మండలాల జీపీల నుంచి సర్పంచ్‌లుగా గెలిచిన వారితో చింతకాని మండలం నాగులవంచలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మధిర నియోజకవర్గంలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ పంచాయతీలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతోనే స్నేహం ఎరుగని గ్రామాల్లో కూడా ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమలుచేస్తున్న పథకాలతో ప్రజలు పట్టం కడుతున్నారని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, రుణమాఫీతో పాటుట ఇంటిగ్రేటెడ్ రెసిరెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు అంశాలతో సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. కాగా, నూతన సర్పంచ్‌ల బాధ్యత ప్రారంభమైందని.. గ్రామపాలనతో పాటు విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పరిమిత వనరులను ప్రాధాన్యతా పనులకు ఖర్చు చేస్తూ గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామపంచాయతీ అభివృద్ధికి తాను సహకరిస్తానని భట్టి హామీ ఇచ్చారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అభివృద్ధి చేసినప్పుడే గుర్తింపు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, నాయకులు కొండబాల కోటేశ్వరరావు, అంబటి వెంకటేశ్వర్లు, కొమ్మినేని రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


