ఎంప్లాయ్‌మెంట్ హబ్‌గా ఫుడ్‌పార్క్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు మెగా ఫుడ్‌పార్క్ ఎంప్లాయ్‌మెంట్ హబ్‌గా మారనుందని, ఇక్కడ ఏర్పాటుచేసే పరిశ్రమలు వ్యవసాయ రంగంలో మార్పు తీసుకురానున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఫుడ్‌పార్క్‌లో సంక్రాంతి నాటికి మరికొన్ని పరిశ్రమలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఫుడ్‌పార్క్ పురోగతిపై మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి తుమ్మల సమీక్షించారు. పొలం నుంచి మార్కెట్‌కు ఉత్పత్తులు వచ్చేలోగా విలువ పెంచేలా ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 26ఎకరాల్లోని 26 ప్లాట్లను పలు కంపెనీలకు కేటాయించగా, తాజాగా దీపక్ నెక్స్‌జెన్ ఆక్వా ప్రాజెక్ట్‌కు స్థలం కేటాయించినట్లు వివరించారు. ఈ కంపెనీ రూ.615 కోట్ల పెట్టుబడితో ప్రారంభించే ఆక్వా పరిశ్రమలో 3,200 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ఈమేరకు అనుమతులు వేగవంతం చేసి సంక్రాంతి నాటికి ప్రారంభించేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇండస్ట్రీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్‌కుమార్, టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శశాంక, ఇండస్ట్రీస్ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ సుష్మ, టీజీఐఐసీ ఈడీ పవన్ కుమార్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సభ్యులు శ్రీరామ్, ఆర్లిన్ తదితరులు పాల్గొన్నారు.
సమీక్షలో మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల


