యూరియా.. దారి తప్పకుండా
పంపిణీ కోసం ప్రత్యేక యాప్
● స్లాట్ బుకింగ్ విధానంలో సరఫరా ● ఈనెల 20వ తేదీ నుంచి అమలుకు కార్యాచరణ
ఖమ్మంవ్యవసాయం: యూరియా పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పంటలకు అవసరమైన మేరకే రైతులు యూరియా తీసుకెళ్లేలా ప్రస్తుత యాసంగి సీజన్ నుంచి ప్రత్యేక ప్రణాళిక అమలుచేయనుంది. గత ఖరీఫ్ సీజన్‌లో యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బంది పడడంతో ఈసారి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా పంపిణీకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈమేరకు ప్రత్యేక యాప్‌ను రూపొందించి స్లాట్ బుకింగ్ విధానంలో పంట విస్తీర్ణానికి సరిపడా యూరియా సరఫరా చేయనున్నారు.
ప్రత్యేక యాప్
రైతులకు యూరియా సక్రమంగా అందించేందుకు ప్రభుత్వం ‘యూరియా బుకింగ్ యాప్’ను అందుబాటులోకి తీసుకొస్తోంది. రైతులు పట్టాదారు పాస్ పుస్తకం వివరాల ఆధారంగా యాప్‌లో నమోదు చేస్తే భూమి విస్తీర్ణం మేరకు ఎంత ఎరువు అవసరమో తెలుస్తుంది. ఆపై యూరియా కావాలనుకున్నప్పుడు యాప్‌లో నమోదు చేస్తే రైతు ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని 15 రోజుల వ్యవధిలో మండలంలోని ఎరువుల దుకాణాలు లేదా సహకార సంఘంలో ఎరువులు తీసుకోవచ్చు. ఈక్రమంలో ఏ దుకాణానికి ఎంత ఎరువు కేటాయించారు, ఎంత సరఫరా అయిందో వివరాలను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూ అవసరమైన మేర స్టాక్ కేటాయిస్తారు. ఇదే విధానం కౌలు రైతులకు కూడా వర్తించేలా యాప్‌ను రూపొందించారు. పట్టాదారు రైతు ద్వారా కౌలు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. రైతులకు ఉన్న భూవిస్తీర్ణం ఆధారంగా మూడు నుంచి నాలుగు సార్లు స్లాట్ బుకింగ్ ద్వారా ఎరువు పొందే వీలుంటుంది.
ఇప్పటికే అవగాహన
యాసంగి సీజన్ ప్రారంభమైన నేపథ్యాన రైతులకు యూరియా సరఫరా చేసేందుకు ఈనెల 20 నుంచి యాప్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆతర్వాత స్లాట్ బుకింగ్‌పై రైతులకు వివరించాల్సి ఉంటుంది.
జిల్లాకు 82 వేల మెట్రిక్ టన్నులు
ప్రస్తుత యాసంగి సీజన్‌లో జిల్లాలో అన్నీ కలిపి 4,16,609 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 2,46,988, మొక్కజొన్న 1,59,462 ఎకరాల్లో సాగు కానున్నాయి. వీటితోపాటు పప్పు ధాన్యాలు, ఇతర పంటలు జాబితాలో ఉన్నాయి. ఈ పంటల కోసం ప్రభుత్వం 82 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. ఇదీకాక జిల్లాలో 16 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి. ఈ యూరియాను పంపిణీ చేస్తూ మరింత అవసరమైతే సరఫరా చేసే అవకాశం ఉంది.
యూరియా.. దారి తప్పకుండా


