కేన్సర్ బాధితులకు ఊరట
అందుబాటులోకి కీమోథెరపీ
తొలిదశలో గుర్తిస్తే ఫలితం
ప్రత్యేక శిక్షణ తీసుకున్నాం..
‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమంతో
కేసుల గుర్తింపు
ఆపై కీమోథెరపీ.. చివరి దశలో
ఉన్నవారికి ‘ఆలన’
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కేన్సర్ బాధితులకు వైద్యసేవలు కొంతమేర మెరుగుపడ్డాయి. ఓపీ సేవలతో పాటు రోగనిర్ధారణ, కీమోథెరపీ, ఆలన ద్వారా చికిత్స అందిస్తున్నారు. కేన్సర్ విభాగం లేకపోయినా ఎంఎన్‌జే సహకారంతో చికిత్స చేస్తూనే మందులు అందజేస్తున్నారు. ప్రస్తుతం కేన్సర్ కేసులు పెరుగుతుండగా, చివరి దశ వరకు గుర్తించకపోవడం పెనుముప్పుగా మారుతోంది. దైనందిన జీవితంలో మారిన అలవాట్లు, ధూమపానం, తంబాకు, గుట్కా తదితర అలవాట్ల మూలంగా కేన్సర్ జిల్లాలో వేగంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యాన వ్యాధి నిర్ధారణకు కావాల్సిన పరీక్షలు పెద్దాస్పత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చారు.
6,222 మంది మహిళలకు పరీక్షలు
సాధారణంగా మహిళలు సర్వైకల్, రొమ్ము, చాతి తదితర కేన్సర్ల బారిన పడుతుండగా, మద్యం, ధూ మపానం, తంబాకు, గుట్కా తినేవారు పెద్దపేగు, నోటి కేన్సర్‌కు గురవుతున్నారు. మహిళలు కేన్సర్ బారినపడకుండా ముందస్తుగా గుర్తించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన ‘ఆరోగ్య మహిళ’ కా ర్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 12 పీహెచ్‌సీ ల్లో 2023 మార్చి 8న ఈ కార్యక్రమం మొదలైంది. ఇప్పటి వరకు 6,222 మంది మహిళలను పరీక్షించి, కేన్సర్‌అనుమానితులను జనరల్ ఆస్పత్రిలో ప్రతీ మంగళ, గురువారం నిర్వహించే పరీక్షలకు పంపిస్తున్నారు. తద్వారా ఇప్పటివరకు 216 మంది మహిళలకు కేన్సర్ ఉన్నట్లు గుర్తించారు. వీరిలో బ్రెస్ట్ కేన్సర్ 89, గర్భాశయ(సర్వైకల్) కేన్సర్ 66, థైరాయిడ్ 19 కేసులు ఉండగా, మిగిలినవి ఇతర రకాల కేన్సర్లు ఉన్నాయి. ఇందులో 37 మంది మృతి చెందగా, పలువురు ఎన్‌ఎంజేలో చికిత్స తీసుకుంటున్నారు.
చివరి దశలో ఉన్న వారికి చేయూత
వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన స్క్రీనింగ్ ద్వారా సు మారు 3 వేల వరకు అనుమానిత కేసులు బయటపడ్డాయి. ఇక ప్రైవేట్‌ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్న వారి గణాంకాలు లేవు. ఎక్కువ మంది బ్లడ్ కేన్సర్, కాలేయ,గర్భాశయ, పెద్దపేగు, నోటి, ఊపిరి తిత్తులు, మెదడు, రొమ్ము తదితర కేన్సర్ల బారిన పడుతున్నారు. ఎమ్‌ఎన్‌జే ఆస్పత్రిలో చికిత్స తీసుకు న్నా ఫలితం లేక జీవిత చరమాంకానికి చేరిన వారు జనరల్ ఆస్పత్రిలోని పాలియేటివ్ కేర్ సెంటర్‌ను ఆశ్రయిస్తున్నారు. కొందరు ఇన్‌పేషంట్లుగా చేరి తే, ఇంకొందరికి ‘ఆలన’ పేరుతో వాహనం ద్వారా మందులు అందిస్తున్నారు. ఈ సెంటర్‌లో ప్రతీనెల సుమారు 50 మంది వరకు చికిత్స పొందుతున్నారు.
కేన్సర్ తీవ్రత ఆధారంగా వైద్యులు కీమోధెరపీ, రేడియోథెరపీ చికిత్స అందిస్తారు. జిల్లా లో ఈ సేవలు అందుబాటులో లేక హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. గత ఏడాది పెద్దాస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి సిబ్బందికి శిక్షణ ఇప్పించాక కీమోథెరపీ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే ప్రతీనెల 50 మంది వరకు కీమోథెరపీ చేయించుకుంటున్నారు. అయితే సేవలపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రత్యేక కేన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేసి రేడియోథెరపీ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొస్తే బాధితులకు ఊరట కలగనుంది.
పెద్దాస్పత్రిలో ప్రతీ మంగళ, గురువారాల్లో నిర్వహించే ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. 130 – 150 మంది చికిత్స కోసం వస్తున్నారు. మామోగ్రామ్, పాప్‌స్మియర్, ఇతర పరీక్షల ద్వారా కేన్సర్‌ను నిర్ధారిస్తున్నాం. తొలి దశలో గుర్తిస్తే చికిత్సతో మెరుగైన ఫలితాలు ఉంటాయి. ప్రతీఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ కేన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.
–డాక్టర్ ప్రేమలత, ‘ఆరోగ్య మహిళ’ నోడల్ ఆఫీసర్
జనరల్ ఆస్పత్రిలో కీమోథెరపీ సేవలు తెలియడంతో ప్రతీనెల 50 మంది వరకు వస్తున్నారు. ఓపీ సేవలకు కూడా వస్తున్నారు. కీమోథెరపీపై నేను, మరికొందరం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాం. ఎమ్‌ఎన్‌జే నుంచి కీమోథెరపీకి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు అందుతుండగా అవసరమైన వారు వినియోగించుకోవాలి. –డాక్టర్ అనూష
జిల్లా జనరల్ ఆస్పత్రిలో
వైద్యసేవలు
కేన్సర్ బాధితులకు ఊరట
కేన్సర్ బాధితులకు ఊరట


