జిల్లా ఆస్పత్రిలో మహిళా ఉన్నతోద్యోగిపై వేధింపులు
ఖమ్మంక్రైం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఓ మహిళా ఉన్నతోద్యోగిని అదే విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు కిందిస్థాయి ఉద్యోగులు వేధిస్తుండగా, ఆమె ఫిర్యాదుతో ఖమ్మంవన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశా రు. ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమెకు.. ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు వాట్సాప్‌లో అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. పలుమార్లు హెచ్చరించినా తీరు మారకపోవడంతో ఆమె ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు.
‘ట్రెసా’నూతన కమిటీలు ఎన్నిక
ఖమ్మంసహకారనగర్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) కలెక్టరేట్ యూనిట్, ఖమ్మం డివిజన్ ఎన్నికలు మంగళవారం జరిగాయి. కలెక్టరేట్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులుగా పగడాల రాజేశ్, రవి, ఖమ్మం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా సురేశ్, శ్రీనివాస్‌తో పాటు కార్యవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని ఎన్నికల అధికారులు బి.వెంకటేశ్వరరావు, వెంకన్న తెలిపారు. నూతన కార్యవర్గాలను అదనపు కలెక్టర్ పిన్‌రెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారుమంచి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుంబూరు సునీల్‌రెడ్డి, పుల్లయ్య తదితరులు అభినందించారు.
ప్రకృతి వ్యవసాయంపై రేపు విజ్ఞాన యాత్ర
ఖమ్మంవ్యవసాయం: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేలా గురువారం విజ్ఞానయాత్ర నిర్వహిస్తున్నట్లు అగ్రి – హార్టి కల్చర్ సొసైటీ ముఖ్య సలహాదారుడు నల్లమల వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రైతులను సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి ప్రచారకుడు విజయ్‌రామ్ ఏపీలోని కృష్ణాజిల్లా పినగూడూరులంకలో నిర్వహిస్తున్న ఐదంచెల ప్రకృతి సేద్య క్షేత్ర సందర్శనకు తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నా రు. కార్యక్రమంలో పాల్గొనే రైతులకు ఉద్యాన శాఖ బస్సులు ఏర్పాటు చేస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
భోజనం కోసం
ఉద్యోగుల పాట్లు
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలంలో బుధవారం జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా స్టాళ్లలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక మధ్యాహ్నం ఒంటి గంటకే కూరలన్నీ అయిపోవడంతో ప్లేట్లలో భోజనం పెట్టుకుని వేచి ఉండాల్సి వచ్చింది. మరోపక్క నీరు తాగేందుకు గ్లాస్‌లు కూడా లేక ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఉద్యోగులకు సరిపడా భోజనాలు తీసుకురాకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది.
రాళ్లదాడిలో
ఒకరికి గాయాలు
కొణిజర్ల: రహదారి విషయంలో ఘర్షణ పడిన కొందరు.. మరో వ్యక్తిపై రాళ్లతో దాడి చేయడంతో గాయాలయ్యాయి. మండలంలోని లాలాపురం నుంచి వైరా శాంతినగర్ వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమాన రోడ్డుకు అడ్డుగా ఉన్న కల్వర్టు పైపులు తొలగించడానికి పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు మంగళవారం లాలాపురం చెరువు వద్దకు రాగా అదే గ్రామానికి చెందిన పాసంగులపాటి రమేశ్ ఇప్పుడు కల్వర్టు తొలగిస్తే రైతులకే కాక మత్స్యకారులకు నష్టం ఎదురవుతుందని చెప్పాడు. ఈ సమయాన గ్రామానికి చెందిన పాసంగులపాటి శ్రీనివాస్, పాసంగులపాటి శ్రీనివాసరావు, కట్ట సత్యనారాయణ తదితరులు రమేశ్‌పై రాళ్లతో దాడిచేయడంతో గాయాలయ్యాయి. ఘటనపై రమేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సూరజ్ వెల్లడించారు.
జిల్లా ఆస్పత్రిలో మహిళా ఉన్నతోద్యోగిపై వేధింపులు


