గ్రామాల్లో తిరిగితేనే సమస్యలు తెలుస్తాయి..
కొణిజర్ల: విద్యుత్ ఉద్యోగులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే సమస్యలు తెలుస్తాయని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్‌ఎఫ్) చైర్‌పర్సన్ ఎన్‌వీ వేణుగోపాలచారి అన్నారు. తనికెళ్లలోని రైతువేదికలో మంగళవారం చింతకాని, కొణిజర్ల మండలాల విద్యుత్ వినియోగదారుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది గ్రామాలకు రాకపోవడంతో ప్రతీ పనికి ప్రైవేట్ సిబ్బందిపై ఆధారపడాల్సి వస్తోందని పలువురు ఫిర్యాదు చేశారు. తనికెళ్ల ఎస్సీకాలనీలో పూర్వ కాలం నాటి ఇనుప స్తంభాలను మార్పించాలని, ఉప్పలచలకలో విద్యుత్ తీగలు సరిచేయాలని రైతు దరియాసింగ్ తదితరులు కోరారు. అంతేకాక తన ఎద్దు మూడేళ్ల క్రితం షాక్‌తో చనిపోతే ఇంతవరకు పరిహారానికి ప్రతిపాదనలు పంపలేదని మరో రైతు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ స్పందిస్తూ వినియోగదారుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్లను చేతికందేలా కాకుండా భూమి నుంచి 6 – 7 అడుగుల ఎత్తు దిమ్మెలపైనే ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో సీజీఆర్‌ఎఫ్ సభ్యులు కె.రమేశ్, ఎన్.దేవేందర్, ఎం.రామారావు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.
సీజీఆర్‌ఎఫ్ చైర్‌పర్సన్ వేణుగోపాలాచారి


