స్వామి సేవకు వేళాయె...
వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక
పూజలకు ఏర్పాట్లు
ఖమ్మంగాంధీచౌక్: ధనుర్మాసంలో నిర్వహించే తిరుప్పావై వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా పేరు మోసిన ఆండాళ్ భగవంతుడినే భర్తగా భావించి ఆయనను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. ఈ వ్రతం నిర్వహించే ధనుర్మాసం మంగళవారం మొదలుకానుంది. సంక్రాతికి ముందు 30 రోజుల కాలాన్ని ధనుర్మాసంగా వ్యవహరిస్తూ ఆలయాల్లో భగవంతుడిని కొలుస్తారు. ఈ మాసంలో ప్రధానంగా శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ధనుర్మాసం మంగళవారం మొదలై జనవరి 14 వరకు ఉంటుంది. ఽఈ నెల పాటు జిల్లాలోని శ్రీ వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈమేరకు ఖమ్మం కమాన్‌బజార్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, త్రీటౌన్‌లోని ప్రాచీన శ్రీ కరిగిరి లక్ష్మీరంగనాథ స్వామి ఆలయం, గుట్టపై ఉన్న శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, శ్రీ రామాలయం, కాల్వొడ్డు, ఇతర ప్రాంతాల్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలతో పాటు జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
మహా విష్ణువుకు ప్రీతిపాత్రం
ధనుర్మాసం శ్రీ మహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదిగా నమ్మిక. అందుకే ఈ నెలంతా వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, గురువారం మహాలక్ష్మికి పూజలు చేస్తారు. ఇక ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశిగా కూడా పిలిచే ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈనెల 30న ముక్కోటి ఉత్సవాల సందర్భంగా ఆలయాల్లో స్వామిని ఉత్తర ద్వారాన దర్శించుకుంటారు. అలాగే, ఈనెలలో బాలికలు, మహిళలు ఇళ్ల ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేయడంతో పాటు ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి మధ్యలో లక్ష్మీదేవి రూపంగా పూలు, పసుపు కుంకుమలతో పూజిస్తారు.
నేటి నుంచి ధనుర్మాసం


