తల్లంపాడు ఉపసర్పంచ్ ఎన్నికలో రసాభసా
ఖమ్మంరూరల్: మండలంలోని తల్లంపాడులో ఉప సర్పంచ్ ఎన్నిక విషయమై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య సోమవారం స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ గ్రామం నుంచి సర్పంచ్‌గా కుమ్మరి అంబేద్కర్ గెలిచారు. గ్రామంలో 12 వార్డులకు ఏడు బీఆర్‌ఎస్, సీపీఎం కూటమి, ఐదు వార్డులను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. అయితే, సోమవారం ఎలాంటి సమాచారం లేకుండా ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడం సరికాదని, మరికొంత సమయం ఇవ్వాలని సర్పంచ్‌గా గెలిచిన అంబేద్కర్ అధికారులను కోరారు. దీంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరో పక్కఎన్నిక నిర్వహించాల్సిందేనని బీఆర్‌ఎస్ వార్డు మెంబర్లు, నాయకులు పట్టుబట్టారు. అయితే, అధికారులు మాత్రం ఎన్నికను వాయిదా వేయడంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం ఎన్నిక నిర్వహించాలని బీఆర్‌ఎస్, సీపీఎం కూటమి నాయకులు నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు.


