యడవల్లి సర్పంచ్‌కు అత్యధిక మెజార్టీ | - | Sakshi
Sakshi News home page

యడవల్లి సర్పంచ్‌కు అత్యధిక మెజార్టీ

Dec 15 2025 9:16 AM | Updated on Dec 15 2025 9:16 AM

యడవల్

యడవల్లి సర్పంచ్‌కు అత్యధిక మెజార్టీ

గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ తండ్రి ఓటమి

ముదిగొండ: ముదిగొండ మండలం యడవల్లి సర్పంచ్‌గా కాంగ్రెస్‌ మద్దతుతో పోటీ చేసిన ఎరకల భారతమ్మ 1,478 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక ఖానాపురంలో కాంగ్రెస్‌ నుంచే ఇరువర్గాల పోటీకి దిగగా మాజీ జెడ్పీటీసీ పసుపులేటి దుర్గ, పోకల బాబు చేతిలో ఓడిపోయారు. అలాగే, వెంకటాపురంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు తండ్రి, 91ఏళ్ల వయస్సు కలిగిన రాయల వెంకటేశ్వర్లు సీపీఎం నుంచి పోటీ చేయగా కాంగ్రెస్‌ అభ్యర్థి కందుల బాలచందర్‌ చేతిలో ఓటమి ఎదురైంది.

నాలుగోసారి సర్పంచ్‌గా...

కామేపల్లి: కామేపల్లి మండలం ముచ్చర్ల సర్పంచ్‌గా మూడు దఫాలు వ్యవహరించిన జాటోత్‌ జాయ్‌లూసీ నాలుగోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచింది. 2004, 2014లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆమె పోటీ ద్వారా సర్పంచ్‌గా గెలిచింది. 2019లో ఏకగ్రీవంగా ఎన్నికై ంది. మళ్లీ ఇప్పుడు సర్పంచ్‌గా గెలవగా.. జాయ్‌లూసీ మాట్లాడుతూ గ్రామాభివృద్ధే ధ్యేయంగా కృషిచేస్తున్న తనను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

సీనియర్‌ నెట్‌బాల్‌

క్రీడాకారుల ఎంపిక

ఖమ్మంస్పోర్ట్స్‌: ఉమ్మడి జిల్లాస్థాయి సీనియర్‌ నెట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఖమ్మంలోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో ఆదివారం జరిగాయి. ఈ పోటీలకు 60 మందికి పైగా పురుషులు, మహిళలు హాజరయ్యారు. మహబూబ్‌నగర్‌లో ఈ నెల 25 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్‌ నెట్‌బాల్‌ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేయగా, వారం పాటు శిక్షణ అనంతరం జట్టును ప్రకటిస్తామని నెట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్‌ దీప్తి, కార్యదర్శి ఎన్‌.ఫణికుమార్‌ తెలిపారు. ఎంపిక పోటీలను ఫాదర్‌ సంపత్‌, విహారి, అఖిల్‌ తదితరులు పర్యవేక్షించారు.

ఖమ్మం మీదుగా

సంక్రాతికి ప్రత్యేక రైళ్లు

ఖమ్మంరాపర్తినగర్‌: సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసిన పలు ప్రత్యేక రైళ్లు ఖమ్మం మీదుగా రాకపోకలు సాగించనున్నాయని సీసీటీఓ రాజగోపాల్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ – కాకినాడటౌన్‌ (07261) ఎక్స్‌ప్రెస్‌ జనవరి 9, 11, 13వ తేదీల్లో ఉంటుందని, కాకినాడ – సికింద్రాబాద్‌(07262) ఎక్స్‌ప్రెస్‌ 10, 12వ తేదీల్లో ఉంటుందని వెల్లడించారు. అలాగే, వికారాబాద్‌ – కాకినాడటౌన్‌ (07271) ఎక్స్‌ప్రెస్‌ 10, 12వ తేదీల్లో, కాకినాడటౌన్‌ – వికారాబాద్‌(07272) రైలు 11వ తేదీన ఉంటుందని తెలిపారు. ఆయా రైళ్లలో ప్రయాణానికి ఖమ్మం రైల్వేస్టేషన్‌లో లేదా ఐఆర్‌సీటీసీ ద్వారా రిజర్వేషన్‌ చేయించుకోవచ్చని పేర్కొన్నారు.

కలుపు మందుతో

మాడిపోయిన మిర్చి తోట

రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో రైతు కేలోతు రామోజీకి చెందిన మిరప తోటపై గుర్తుతెలియని వ్యక్తులు కలుపు మందు పిచికారీ చేశారు. దీంతో తోట కొంత మేర మాడిపోయిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈనెల 11న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటేయలేదనే కక్షతోనే కొందరు రాత్రి ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసిన ఆయన, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

వైరల్‌ ఫీవర్‌తో

యువతి మృతి

మధిర: మహదేవపురం గ్రామానికి చెందిన ఓ యువతి వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతూ ఆదివారం మృతి చెందింది. గ్రామానికి చెందిన కిన్నెర గోపి కుమార్తె మహాలక్ష్మి (17) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను శనివారం ఖమ్మంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామ నూతన సర్పంచ్‌ వాసిరెడ్డి నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్‌ నాయకులు మొండితోక జయాకర్‌ మహాలక్ష్మి మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు.

రోడ్డుప్రమాదంలో

ముగ్గురికి గాయాలు

రఘునాథపాలెం: మండలంలో రఘునాథపాలెం–చింతగుర్తి మార్గంలో ఆదివారం ట్రాక్టర్‌ ఢీకొనగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. మండలంలోని రాంక్యాతండాకు చెందిన బోడ రవి తన భార్య, కుమార్తెతో ఖమ్మం నుండి రాంక్యాతండా వెళ్తున్నాడు. వీరి ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ ఢీకొట్టగా ముగ్గురు గాయపడ్డారు. దీంతో ఆస్పత్రికి తరలించగా, ఘటనపై రఘునాథపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యడవల్లి సర్పంచ్‌కు అత్యధిక మెజార్టీ
1
1/1

యడవల్లి సర్పంచ్‌కు అత్యధిక మెజార్టీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement