సత్వర సేవలు..
సద్వినియోగం చేసుకోవాలి
● బాలింతలు, గర్భిణులకు అండగా ‘102’ ● ఉమ్మడి జిల్లాలో 30 వాహనాల ద్వారా లబ్ధి ● అత్యవసర సేవల్లో మేటిగా ‘108’ వాహనాలు
ఖమ్మంవైద్యవిభాగం: అత్యవసర వైద్యసేవలు అందించటంలో 108, 102 వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ వాహనాల ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు చేరవేయటంలో 108 వాహనాలు కీలక ప్రాత పోషిస్తుండగా, గర్భిణులు, బాలింతలను క్రమం తప్పకుండా పెద్దాస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించి తిరిగి గమ్యస్థానాలకు చేర్చడంలో 102 వాహనాలదే ప్రముఖ పాత్ర. ఈ వాహనాలు గర్భిణులు, బాలింతలు, అత్యవసర చికిత్స పొందే వారికి సంజీవనిలా ఉపయోగపడుతున్నాయి.
అమ్మ ఒడి సేవలతో..
గతంలో గర్భిణులు ప్రతీనెలా వైద్య పరీక్షలతో పాటు ప్రసవ సమయాన ఆస్పత్రులకు వెళ్లటానికి ఇబ్బంది పడేవారు. సరైన రవాణా సౌకర్యాలు లేక ఇతర వాహనాలు సమకూర్చుకొని అవస్థలు పడుతూనే వెళ్లే వారు. కానీ, 102 అమ్మ ఒడి సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వారి ఇబ్బందులు తప్పాయి. వాహనాల్లో ఆశ కార్యకర్తలు వెంట ఉండి అవసరమైన పరీక్షలు చేయిస్తున్నారు. ఈ వాహనంలో అత్యవసర చికిత్సకు వైద్య కిట్లు, ప్రసవానికి అవసరమయ్యే పరికరాలు అందుబాటులో ఉన్నందున ఇబ్బందులు ఎదురుకావడం లేదు. ప్రసవానంతరం కొన్ని నెలల వరకు తల్లీబిడ్డలకు అవసరమయ్యే టీకాలు వేయించేందుకు, ఇతర చికిత్స కోసం పెద్దాస్పత్రికి తీసుకెళ్లి తిరిగి ఇంటి వద్దకు చేర్చుతున్నారు. ఈ వాహనాల ద్వారా పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉపకేంద్రాల వారీగా గర్భిణులు, బాలింతలకు సేవలందుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19 వాహనాలు ఉండగా, గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ఉమ్మడి జిల్లాలో 1,89,088 మంది గర్భిణులు, బాలింతలు వీటి ద్వారా వైద్యసేవలు పొందారు.
50,862 మందికి
అత్యవసర సేవలు
ఉమ్మడి జిల్లాలో అత్యవసర వాహన సేవలు కీలకంగా మారాయి. ప్రమాద బాధితులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రులకు చేర్చటంలో 108 వాహనాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అంతే కాకుండా ప్రసవ వేదనతో బాధపడుతున్న వారిని ఆస్పత్రులకు తరలించటంలోనూ ముఖ్య భూమిక ఈ వాహనాలదే. ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర, జాతీయ రహదారులు ఉండటంతో తరచూ వాహన ప్రామాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయాన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తూ వందలాది మంది ప్రాణాలు నిలుపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 108 వాహనాలు 49 ఉండగా, భద్రాద్రి జిల్లాలో 28 వాహనాలు, ఖమ్మం జిల్లాలో 21 వాహనాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతాలకు వెళ్లి అత్యవసర చికిత్స అవసరమైన రోగులను 108 వాహనం ద్వారా తరలిస్తూ ప్రాణాలు నిలుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 50,862 మందికి అత్యవసర చికిత్స అందించి వారి ప్రాణాలు నిలపడంలో 108 వాహనాలు, సిబ్బంది కీలక పాత్ర పోషించారు.
ఉమ్మడి జిల్లావాసులు 102, 108 వాహన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు సైతం వాహనాలు వెళ్తున్నాయి. 102 వాహనం ద్వారా ప్రసవానంతరం తల్లీబిడ్డలను ఇంటికి చేర్చడం, బాలింతలకు అవసరమైన పరీక్షలు, చికిత్స అందిస్తున్నాం. ఫోన్ చేసిన పావు గంట లోపే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను రక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసర సమయంలో వాహనంలోనే ప్రసవం చేసేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. – శివకుమార్,
108, 102 వాహనాల ప్రోగ్రామ్ మేనేజర్
సత్వర సేవలు..


