లెక్క పక్కాగా ఉండేలా..
అన్ని వివరాలు ఉంటాయి...
● ఎరువులు, విత్తనాల వివరాల నమోదుకు పుస్తకం ● పీఏసీఎస్‌ల ఆధ్వర్యాన రైతులకు పంపిణీ
నేలకొండపల్లి: వానాకాలం సీజన్‌లో ఎరువుల కోసం రైతులు పడిన పాట్లు అన్నీఇన్ని కావు. సొసైటీలకు సమయానికి ఎరువులు చేరక, వచ్చిన ఎరువులు ఎవరు తీసుకెళ్లారో లెక్క తెలియకపోవడంతో కొందరు ఎక్కువ ఎరువులు తీసుకెళ్లగా, మరికొందరికి అసలే దక్కక పడిగాపులు కాశారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఏయే రైతు ఎన్ని ఎరువులు, ఎంత మొత్తంలో విత్తనాలు తీసుకున్నారో పూర్తి వివరాలు నమోదు చేసేలా పీఏసీఎస్‌ల ద్వారా పుస్తకాలు అందించనున్నారు. ఈ పుస్తకంతో రైతు సొసైటీకి వెళ్తే భూవిస్తీర్ణం ఆధారంగా ఎరువులు, విత్తనాలు అందించే అవకాశముంది.
పూర్తి వివరాలు
పీఏసీఎస్‌ల వారీగా సభ్యత్వం ఉన్న అన్నదాతలకు ‘రైతు ఎరువుల పాస్‌పుస్తకం’ పేరిట పుస్తకాలు అందిస్తున్నారు. నేలకొండపల్లి మండలంలోని బోదులబండ పీఏసీఎస్‌లో ఈ పుస్తకాల పంపిణీని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య ఇటీవల ప్రా రంభించారు. దశల వారీగా అన్ని పీఏసీఎస్‌ల పరిధి రైతులకు వీటిని అందజేయనుండగా వీటిపై రైతు పేరు, ఆధార్ నెంబర్, గ్రామం, మండలం, జిల్లాతో పాటు ఇతరత్రా వివరాలను నమోదు చేస్తారు. అలాగే, సేల్స్‌మెన్ ఫోన్ నంబర్లు, కేంద్రం తెరిచి ఉండే సమయం కూడా ముద్రించారు. రైతులు ఈ పుస్తకంతో వెళ్తే వారు తీసుకున్న ఎరువులు, విత్తనాల వివరాలను అందులో నమోదు చేయనున్నారు. భూవిస్తీర్ణం ఆధారంగా వీటిని పంపిణీ చేయనుండగా, పరిమితికి మించి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే పుస్తకంలోని వివరాల ఆధారంగా నిరా కరించే అవకాశముంది. తద్వారా అవసరం మేరకే విత్తనాలు, ఎరువులు తీసుకెళ్తారని, ఫలితంగా అందరికీ అందుతాయని అధికారులు చెబుతున్నారు.
రైతులకు ప్రభుత్వం సరఫరా చేసే ఎరువులు, విత్తనాలు ఎంత మేరకు తీసుకున్నారో ఈ పుస్తకంలోని వివరాల ఆధారంగా తెలిసిపోతుంది. అంతేకాక భూవిస్తీర్ణం ఆధారంగానే పంపిణీ చేపట్టే అవకాశం ఏర్పడుతుంది. ఈ పుస్తకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– ఎం.రాధ, ఏఓ, నేలకొండపల్లి
లెక్క పక్కాగా ఉండేలా..
లెక్క పక్కాగా ఉండేలా..


