గ్రామం ఇక్కడ, ఓటర్లు అక్కడ..!
చుంచుపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం వెంకటేశ్‌ఖని గ్రామపంచాయతీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఓటర్లందరూ ప్రస్తుతం స్థానికంగా నివసించడం లేదు. రెండు నెలల క్రితం సింగరేణి అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడి 70 కుటుంబాలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయి. దీంతో ఇక్కడ ముగ్గురు, నలుగురు ఓటర్లు మాత్రమే మిగిలిపోయారు. ఈ గ్రామపంచాయతీకి 2014 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. 2018 ఎన్నికల్లో కేవలం 146 ఓట్లతో ఇక్కడ పంచాయతీ పాలకవర్గాలను ఎన్నుకున్నారు. ఇటీవల వరకు ఈ గ్రామపంచాయతీ పరిధిలో 256 మంది జనాభా ఉండగా, తాజా ఓటర్ల జాబితాలో ఇక్కడ 183 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇందులో 93 మంది మహిళలు కాగా, 90 మంది పురుషులు ఉన్నారు. అయితే, సింగరేణి సంస్థ విస్తరణలో భాగంగా బ్లాస్టింగ్ జోన్‌కు ఆతిదగ్గరలో ఉండడంతో అధికారులు ఇక్కడ నివసిస్తున్న కుటుంబాలను ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించడంతోపాటు గంగహుస్సేన్‌బస్తీలో ప్రత్యేక స్థలాలను ఇచ్చారు. దీంతో ఇక్కడ ఉన్న ఊరు ఖాళీ అయింది. ఇక్కడి కుటుంబాలు స్థానికంగా ఉన్న రామవరం, రుద్రంపూర్, పెనగడప, గౌతంపూర్ ప్రాంతాలకు తరలి వెళ్లాయి. కేవలం ఒక కుటుంబంలోని ముగ్గురు, నలుగురు ఓటర్లు మాత్రమే ప్రస్తుతం ఊరిలో ఉన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లు అందరూ ఇక్కడ ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటు వేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు రిజర్వేషన్ చేశారు. మిగిలిన 4 వార్డులను ఎస్టీ జనరల్‌కు ఒకటి, జనరల్ మహిళకు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి కేటాయించారు. ఇక్కడ జనాభాతో పాటు ఓటర్లు సైతం లేకపోవడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం చూడా చేయడం లేదు. ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లను వెతికి పట్టుకోవాలంటే అవస్థలు పడాల్సి వస్తోంది. చిరునామా కనుక్కొని వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 14న రెండో విడతలో వెంకటేశ్‌ఖని పంచాయతీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న 183 మంది ఓటర్లను ఇక్కడే ఓటు వేసే విధంగా అధికారులు చర్య లు చేపడుతున్నారు.
వెంకటేశ్‌ఖనిలో విచిత్ర పరిస్థితి


