రెండో విడతకు నేటితో తెర
● చివరిరోజు జోరుగా సాగనున్న ప్రచారం ● ఆపై ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహాలకు పదును
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే ఆరు మండలాల్లో శుక్రవారం సాయంత్రం 5గంటలతో ప్రచారం ముగియనుంది. కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని పంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు జరగనుండగా గుర్తులు కేటాయించినప్పటి నుంచి అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక చివరి రోజు ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ప్రచారం ముగిశాక పోలింగ్‌కు ఒకేరోజు సమయం ఉండడంతో ఓటర్లతోపాటు ప్రత్యర్థి శిబిరంలోని నాయకులను ప్రసన్నం చేసుకునేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు.
160 జీపీల్లో ఎన్నికలు
కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని 183 గ్రామపంచాయతీల సర్పంచ్ స్థానాలు, 1.686 వార్డులకు ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ వెలువడింది. అయితే ఆరు మండలాల్లో 23 సర్పంచ్ స్థానాలు, 306 వార్డులు ఏకగ్రీవం కాగా.. ఒక వార్డుకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 160 జీపీలు, 1,379 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు 451 మంది, వార్డుసభ్యులుగా 3,352 మంది బరిలో ఉన్న ఈ జీపీల్లో 14న పోలింగ్ జరగనుంది.
ప్రచార హవా..
రెండో విడత ఎన్నికలకు గత నెల 30నుంచి ఈనెల 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. ఈనెల 6వ తేదీన ఉపసంహరణల పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారాన్ని షురూ చేశారు. సర్పంచ్, వార్డుల అభ్యర్థులు ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్లను పలకరించి తమ గుర్తును వివరిస్తూ ఓటు వేసి ఆశీర్వదించాలంటూ కోరారు. అలాగే ఫ్లెక్సీలు, పోస్టర్లు, స్టిక్కర్లతో ప్రచారం ముమ్మరం చేశారు. అభ్యర్థులు ఎక్కువగా తమ గుర్తును ఓటర్లకు పరిచయం చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే తమకు మద్దతు ఇస్తున్న పార్టీల్లోని మండల, గ్రామస్థాయి నేతలను ప్రచారంలోకి దింపారు. ఇక చివరిరోజైన శుక్రవారం ప్రచారం హోరెత్తించేలా అభ్యర్థులు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు.


