హస్తందే హవా..
నియోజకవర్గాల వారీగా ఇలా...
136 సర్పంచ్ పదవులు పార్టీ మద్దతుదారులు కై వసం 34 స్థానాల్లో బీఆర్‌ఎస్, 10చోట్ల సీపీఎం, ఆరు చోట్ల సీపీఐ పాగా ఆరు స్థానాల్లో ఇండిపెండెంట్ల విజయం కొన్నిచోట్ల ఓట్ల లెక్కింపు సమయాన ఉద్రిక్తత
పల్లె పోరు తొలి విడతలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఎన్నికలు జరిగిన ఏడు మండలాల్లో మెజార్టీ గ్రామపంచాయతీల సర్పంచ్ పదవులు ఆ పార్టీ మద్దతుదారుల వశమయ్యాయి. తొలి విడతలో 20 ఏకగ్రీవాలు పోగా మిగిలిన 172 జీపీలకు ఎన్నికలు నిర్వహిస్తే అధికార కాంగ్రెస్ మద్దతుదారులు 136 సర్పంచ్ పదవులు ‘చే’జిక్కించుకున్నారు. దీంతో ఫలితాలు వెలువడుతుండగా ఆ పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక బీఆర్‌ఎస్, సీపీఎం పొత్తు ఆయా పార్టీల మద్దతుదారులకు కొన్నిచోట్ల కలిసొచ్చింది. బీఆర్‌ఎస్ 34, సీపీఎం పది, సీపీఐ ఆరు, ఇతరులు ఆరు సర్పంచ్ స్థానాల్లో పాగా వేశారు. ఒకటి, రెండు జీపీల్లో ఒక్క ఓటు తేడాతో అభ్యర్థులను విజయం వరించగా.. సమాన ఓట్లు వచ్చిన జీపీల్లో రీకౌంటింగ్ నిర్వహించారు. ఆందోళనల తర్వాత డ్రా తీసి విజేతలను ప్రకటించారు. కొన్ని గ్రామపంచాయతీల్లో అభ్యంతరాల కారణంగా రాత్రి 11 గంటల వరకు లెక్కింపు కొనసాగింది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
కాంగ్రెస్‌లో జోష్
జిల్లాలో మొదటి విడతగా రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఎన్నికలు జరిగాయి. నామినేషన్ల ఉపసంహరణ సమయంలోనే ఏకగ్రీవాలు ఆ పార్టీలో జోష్ నింపాయి. మొత్తం 192జీపీలకు గాను 20పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. పార్టీ అధికారంలో ఉండడంతో ముందుగానే పార్టీ జిల్లా, మండల స్థాయి నేతలు బరిలో ఉందామనుకున్న ఆశావహులతో చర్చించి ఏకగ్రీవం చేశారు. గ్రామాభివృద్ధి, పెండింగ్ సమస్యల పరిష్కారం తదితర హామీలతో ఏకగ్రీవానికి అటు ఆశావహులు, ఇటు ప్రజలు అంగీకరించారు.
బీఆర్‌ఎస్, సీపీఎం పొత్తుతో
ఎన్నికల్లో బీఆర్‌ఎస్, సీపీఎం పొత్తు పలు పంచాయతీలపై ప్రభావం చూపింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే ఆ రెండు పార్టీలు పోటీపై ఒక నిర్ణయానికి వచ్చి తమ మద్దతుదారునుల బరిలోకి దింపాయి. దీంతో మధిర నియోజవకర్గంలో ఎన్నికలు జరిగిన నాలుగు మండలాల్లోని పలు పంచాయతీల్లో ఈ పార్టీల మద్దతుదారులు విజయం సాధించారు. దీంతో కచ్చితంగా గెలుస్తామనుకున్న పంచాయతీల్లో విజయంపై కాంగ్రెస్ పార్టీ వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. ఇక పలు పంచాయతీల్లో సీపీఎం, బీఆర్‌ఎస్ మద్దతుతో నిలిచిన అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎర్రుపాలెం మండలంతో పాటు మిగతా మండలాల్లోని పలు పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులు గెలిచారు.
ఖమ్మం నియోజకవర్గంలోని ఒకే ఒక్క మండలమైన రఘునాథపాలెంలో 37 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో ఐదు కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవం కాగా, 32 జీపీల్లో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ పార్టీ 26, బీఆర్‌ఎస్ 11 సర్పంచ్ స్థానాలను దక్కించుకుంది.
మధిర నియోజకవర్గంలో ముదిగొండ మినహా చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నాలుగు మండలాల్లో మొత్తం 106 జీపీల్లో 11 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 10 కాంగ్రెస్, ఒకటి సీపీఐ ఖాతాలో పడ్డాయి. మిగిలిన 95 జీపీలకు ఎన్నికలు నిర్వహిస్తే ఏకగ్రీవాలతో కలిపి 72సర్పంచ్ స్థానా లను కాంగ్రెస్ మద్దతుదారులు, 19 స్థానాల్లో బీఆర్‌ఎస్, సీపీఎం ఎనిమిది, సీపీఐ మద్దతుదారులు ఐదు, ఇండిపెండెంట్లు నాలుగు చోట్ల సర్పంచ్ స్థానాలను దక్కించుకున్నారు.
వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల మండలాల్లోని గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వైరా మండలంలో 22 జీపీలకు గాను తొలుత నాలుగు ఏకగ్రీవం కాగా ఇవన్నీ కాంగ్రెస్‌కే దక్కాయి. మిగతా 18పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ మద్దతుదారులు 16, బీఆర్‌ఎస్ ఒకటి, సీపీఎం ఒక చోట సర్పంచ్ స్థానాన్ని దక్కించుకున్నాయి.
కొణిజర్ల మండలంలో 22పంచాయతీలకు అన్ని చోట్ల ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ 18, బీఆర్‌ఎస్ మూడు, సీపీఎం, సీపీఐ ఒక్కో పంచాయతీ, ఇండిపెండెంట్లు నాలుగు చోట్ల విజేతలుగా నిలిచారు.
తొలి విడత మెజార్టీ జీపీలు కాంగ్రెస్ ఖాతాలోనే..
హస్తందే హవా..


