హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై సంపూర్ణ అవగాహన
● తద్వారా కేన్సర్ రహిత సమాజస్థాపన ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మంవైద్యవిభాగం: హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. జిల్లా, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన ఖమ్మంలోని జెడ్పీ సమావేశ మందిరంలో హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్‌పై గురువారం ఉద్యోగులకు ఏర్పాటుచేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ప్రజారోగ్యం దృష్ట్యా వ్యాక్సిన్ కీలకమని, 14ఏళ్ల లోపు బాలికల్లో సర్వైకల్ కేన్సర్ నివారించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ద్వారా చికిత్స వ్యయ భారం, మరణాలను తగ్గించే అవకాశమున్నందున ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అంకాలజిస్ట్ సిద్ధార్థ ముఖర్జీ రచించిన ’ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మలాడీస్ ఏ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్సర్ ’ పుస్తకాన్ని చదివితే కేన్సర్ మూలాలు, శాసీ్త్రయ పురోగతి, శస్త్రచికిత్స, కీమోథెరపీపై అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. కాగా, వ్యాక్సిన్ ఆవశ్యకతపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడానికి అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని కలెక్టర్ సూచించారు. సహజంగా కొత్త వ్యాక్సిన్ వస్తున్నప్పుడు ప్రజల్లో భయాలు ఉంటాయని వాటిని దూరం చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. త్వరలోనే కేంద్రప్రభుత్వం వ్యాక్సిన్ పంపిస్తుందని, ఆలోపు అవగాహన కల్పించాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ డి.రామారావు మాట్లాడుతూ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ ద్వారా నోరు, గొంతు కేన్సర్లను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణు మాధవరావు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎం.నరేందర్, వైద్యులు, అధికారులు కృపాఉషశ్రీ, ఎం.ప్రదీప్‌బాబు, అరుణాదేవి, ప్రతాప్ సంపత్‌కుమార్, డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్ మురారీ, సుబ్రహ్మణ్యం, శేషుపద్మ, అన్వర్, రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.


