నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, శ్రీ సీతారామచంద్ర స్వామిని విశాఖపట్నంలోని డీఎస్ నేషనల్ లా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.సూర్యప్రకాష్ కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


