●ఓటర్లకు భరోసా కల్పించండి
ఖమ్మంవైరారోడ్: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు బలగాలను కేటాయించాలని బీఆర్‌ఎస్, సీపీఎం నాయకులు కోరారు. ఈమేరకు బుధవారం వారు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌కు వినతిపత్రం అందజేశారు. గత అనుభవాలు, ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్న గ్రామపంచాయతీల జాబితాను సీపీకి సమర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో అదనపు బలగాలను మోహరించి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా భరోసా కల్పించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీపీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సీపీఎం, బీఆర్‌ఎస్ నాయకులు నున్నా నాగేశ్వరరావు, బెల్లం వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.


