చలి.. చలిగా..
కమ్మేస్తున్న మంచు
జిల్లాలో చలిగాలులు, మంచుప్రభావం
ఉదయం, రాత్రి కనిష్టస్థాయిలో
ఉష్ణోగ్రతలు
మధ్యాహ్నం ఎండ ప్రభావం
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లావాసులను కొద్ది రోజులుగా చలి వణికిస్తోంది. గత ఐదారు రోజుల నుంచి చలి ప్రభావం మరింత పెరిగింది. ఉదయం 10గంటల వరకు చలిగాలులు వీస్తుండగా.. సాయంత్రం 5గంటల నుంచే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాత్రి సమయాన చలి గాలులు తీవ్రంగా ఉంటుండడంతో ప్రజలు అవస్థ పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకపోగా, వృద్ధులు, పిల్లలు తట్టుకోలేకపోతున్నారు.
బయటకొస్తే వణుకు
నిన్న మొన్నటి వరకు తుపాన్లతో ఉక్కిరిబిక్కిరైన జనం ఇప్పుడు చలిగాలుల తీవ్రతతో ఇబ్బంది పడుతున్నారు. కొద్దిరోజులుగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం 10గంటల్లోపు.. సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు రావాలంటేనే ప్రజలు వణుకుతున్నారు. అత్యవసర పనులపై బయటకు వస్తే స్వెట్టర్లు, జాకెట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది. వృద్ధులు, పిల్లలు చలితీవ్రతతో అనారోగ్యానికి గురవుతున్నారు.
పగలు 29.. రాత్రి 15 డిగ్రీలు
పగలు, రాత్రి వేళ ఉష్ణోగ్రతల్లో తేడా కనిపిస్తోంది. ఉదయం 10గంటల వరకు వాతావరణం చల్లగానే ఉంటోంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 18డిగ్రీలకు మించడం లేదు. ఇక మధ్యాహ్నం 12గంటలయ్యే సరికి ఒక్కసారిగా సూర్యుడు విజృంభిస్తున్నాడు. మధ్యాహ్నం సమయాన ఉష్ణోగ్రత 29డిగ్రీల వరకు నమోదవుతోంది. సాయంత్రం 4గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటుండగా.. ఆతర్వాత నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఐదు గంటల సమయాన 20డిగ్రీలుగా, ఆతర్వాత రాత్రికి మరింత పడిపోయి 15డిగ్రీల మేర నమోదవుతోంది.
ప్రస్తుత తరుణంలో ఉదయం, రాత్రి సమయాల్లో మంచు కమ్మేస్తోంది. పొగమంచు కారణంగా విపరీతమైన చలి ఉంటోంది. తెల్లవారుజాము నుంచి ఉదయం 8గంటల వరకు మంచు తెరలు వీడడం లేదు. దీంతో వాహనదారులు ప్రయాణానికి ఇబ్బంది పడుతున్నారు. లారీలు, బస్‌లు, ఇతర వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఉపశమనం కోసం కొందరు చలి మంటలు వేసుకుంటుండగా.. స్వెటర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి.
చలి.. చలిగా..


