రేషన్ షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు
ఖమ్మంఅర్బన్: ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా అందిస్తున్న సన్నబియ్యాన్ని కొందరు డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణల నేపథ్యాన రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్‌మెంట్ శాఖ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ నుంచి విజిలెన్స్ ఓఎస్డీ, డీఎస్పీ అంజయ్య నేతృత్వాన జిల్లాకు వచ్చిన నాలుగు బృందాలు మంగళ, బుధవారం 40 రేషన్ షాపుల్లో తనిఖీ చేసినట్లు తెలిసింది. ఈక్రమంలోనే ఖమ్మం లోని 91వ రేషన్ షాపును తనిఖీ చేయడానికి అధికారులు రాగా తాళం వేసి ఉండడం, పలుమార్లు ఫోన్ చేసినా డీలర్ వెంకటేశ్వర్లు స్పందించకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో షాప్‌నకు సీల్ వేసిన అధికారులు, డీలర్ వచ్చాక తెరిచి అదనంగా కానీ తక్కువ కానీ బియ్యం ఉంటే క్రిమినల్ కేసు నమోదు చేయాలని సివిల్ సప్లయీస్ అధికారులకు సూచించారు. టేకులపల్లిలో మరో రేషన్ షాపును తనిఖీ చేయగా రికార్డుల కన్నా అదనంగా బియ్యం ఉన్నట్లు విజిలెన్స్ బృందం గుర్తించినట్లు తెలిసింది. తనిఖీల్లో సివిల్ సప్లయీస్ డీటీలు మెచ్చు వెంకటేశ్వర్లు, విజయ్‌బాబు, నాగలక్ష్మి, తహసీల్దార్ బాషా, టాస్క్‌ఫోర్స్ ఏఎస్సై వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలో ఓ షాప్‌నకు సీల్


