ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
ఖమ్మంరూరల్/తిరుమలాయపాలెం: గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా అభ్యర్థులు, పార్టీల నాయకులు బాధ్యతతో వ్యవహరించాలని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లోని జీపీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సమావేశాలు మంగళవారం నిర్వహించగా ఆయన మాట్లాడారు. అభ్యర్థులు నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరిస్తే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగుస్తాయని తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా కేసులు నమోదవుతాయని సీపీ హెచ్చరించారు. కాగా, ఫలితాల అనంతరం ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఈసమావేశాల్లో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ ఎం.అపూర్వ, అడిషనల్ డీసీపీ విజయబాబు, ఏసీపీలు తిరుపతిరెడ్డి, నర్సయ్య, సీఐలు ముష్క రాజు, ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు కూచిపూడి జగదీష్, రామలింగారెడ్డి, తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
2వేల మంది సిబ్బందితో బందోబస్తు
ఖమ్మంక్రైం: గ్రామపంచాయితీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో రెండు వేల మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని సీపీ సునీల్‌దత్ తెలిపారు. అడిషనల్ డీసీపీలు, ఏసీపీల పర్యవేక్షణలో వీరు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాల్లో సాయుధ పోలీస్ బలగాలను మోహరించడంతో పాటు ప్రత్యేక బృందాలతో డబ్బు, మద్యం ప్రభావాన్ని నియంత్రించేలా 16 సరిహద్దు చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు ముమ్మరం చేశామని వెల్లడించారు. కాగా, 953 బైండోవర్ కేసుల్లో 6,403మందిని తహసీల్దార్ల ఎదుట హాజరుపర్చడమే కాక 207మంది రౌడీషీటర్లు 1,100 మంది పాతనేరస్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు అక్రమంగా నిల్వ చేసిన రూ.12లక్షల విలువైన 1,200 లీటర్ల మద్యం సీజ్ చేశామని తెలిపారు. అంతేకాక 86మంది తమ ఆయుధాలను అప్పగించారని సీపీ వివరించారు.
పోలీసు కమిషనర్ సునీల్‌దత్


