కార్యదర్శులకు కష్టమొచ్చింది..
భారం పడకుండా చూస్తాం..
● తడిసి మోపెడవుతున్న పంచాయతీ ఎన్నికల ఖర్చు ● ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఇక్కట్లు
వైరా: జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీల ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. మూడో విడ త ఎన్నికలు జరిగే జీపీల్లోనూ నామినేషన్ల ఉపసంహరణ పూర్తికాగా.. తొలిదశ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఈమేరకు పంచాయతీ ఎన్నికల ఏర్పాట్ల బాధ్యత కార్యదర్శులు చూస్తున్నారు. ఇంత వరకు బాగానే ప్రతీసారి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందస్తుగానే నిధులు విడుదల చేస్తుంది. కానీ ఈ నిధులు నిధులు కేటాయించకపోవడంతో కార్యదర్శుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే గ్రామాల్లో రెంఎడేళ్ల నుంచి పాలకవర్గాలు లేక పారిశుద్ధ్య పనులు, ఇతరత్రా అవసరాలకు కార్యదర్శులే అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెడుతున్నారు. ఇంతలోనే ఎన్నికలు రావడం, ఖర్చు తడిసి మోపెడవుతుండడంతో ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నారు.
భారంగా ఖర్చులు...
పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణ మొదలు లెక్కింపు వరకు గ్రామస్థాయిలో కార్యదర్శులే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఓటర్ స్లిప్పుల పంపిణీ, పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణతో పాటు ఉద్యోగుల భోజన ఏర్పాట్లు చూడాల్సి వస్తోంది. కేంద్రాల వద్ద టెంట్లు కూడా వేయించాల్సి ఉండడంతో ఒక్కో పంచాయతీ కార్యదర్శికి రూ.30వేల నుంచి రూ.40 వేలకు పైగా ఖర్చవుతోందని చెబుతున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఇప్పటికే ఖర్చు రూ.25 వేలు దాటిందని వాపోతున్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో...
జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరగనుండగా, మొదటి దశలో 192, రెండో విడతలో 183, మూడో విడతలో 191 గ్రామపంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు ఎన్నికల నిర్వాహణ ఖర్చులన్నీ అప్పు తెచ్చి మరీ తామే భరిస్తున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితిలో ఏర్పాట్లు చేస్తుండగా.. మరింత భారం పడకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.
ఓ కార్యదర్శి ఆవేదన...
పంచాయతీ ఎన్నికల ఖర్చు మాకు భారంలా మారింది. ఒక్కో పంచాయతీలో ఎన్నికలకు సంబంధించి రూ.20వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు తప్పడం లేదు. అధికారుల ఆదేశాలతో చేసేదేం లేక ఖర్చు పెడుతున్నాం. ఈ నిధులు విడుదల చేస్తే మా ఇక్కట్లు తీరతాయి.
‘పంచాయతీ ఎన్నికల వేళ గ్రామ కార్యదర్శులపై వ్యయభారం పడకుండా చర్యలు తీసుకుంటాం. అయితే, మౌలిక సదుపాయాలతో పాటు సిబ్బందికి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత వారిదే. నిధుల విషయంలో ఇక్కట్లు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటాం’ అని ఓ ఎంపీడీఓ తెలిపారు.


