‘విధుల కేటాయింపులో లోపించిన పారదర్శకత
ఖమ్మం సహకారనగర్/ఏన్కూరు: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి విధుల కేటాయింపులో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు ఆరోపించారు. కొందరికి రెండు, మూడు విడతల విధులు కేటాయించగా, మరికొందరిని పూర్తిగా తొలగించారని తెలిపారు. అంతేకాక కొన్నిచోట్ల సీనియర్లను ఓపీఓలుగా నియమించి, అత్యంత జూనియర్లను ప్రిసైడింగ్ అధికారులుగా నియమించడం సరికాదని పేర్కొన్నారు. అధికారులు ర్యాండమైజేషన్ విధానం పాటించామని చెబుతున్నారని తెలిపారు. ఇకనైనా మూడు విడతల డ్యూటీ ఇచ్చిన వారిని ఒక విడత నుంచి తప్పించాలని, విధుల మరుసటి రోజు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని వారు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కాగా, మూడు విడతల ఎన్నికలకు విధులు కేటాయించిన ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని, పోలింగ్ మరుసటి రోజు ఓడీ సౌకర్యం కల్పించాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్టా శేఖర్‌రావు, ఆర్.రంగారావు కలెక్టర్ అనుదీప్‌ను కోరారు. అలాగే, ఏన్కూరులో టీఎస్ యూటీఎఫ్ మండలల అధ్యక్షుడు బి.రాంచందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా కార్యదర్శి డీఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ అధికారులు ఇకనైనా ఎన్నికల విధుల విషయంలో పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు సింగ్యా, రమేష్, శ్యామల, సుశ్మిత, ఎం.పుల్లయ్య, జె.పుల్లయ్య, శంకర్రావు, రాఘవరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.


