కాషాయ జెండా ఎగరడం ఖాయం
ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది నూటికి నూరు శాతం బీజేపీ ప్రభుత్వమేనని.. ఈ చారిత్రక మార్పును ఎవరూ అడ్డుకోలేరని పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ తెలిపారు. ఖమ్మంలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాక పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని సూచించారు. బూత్ స్థాయి నుంచే పటిష్టమైన సైన్యాన్ని నిర్మించుకుంటే మంచి ఫలితా లు వస్తాయని తెలిపారు. గత పదేళ్లుగా బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకోగా, ఇప్పుడు కాంగ్రెస్ కూడా బాటలో పయనిస్తోందని ఆరోపించారు. కేవలం మూడు రాష్ట్రాల్లో తప్ప ఉనికి లేని కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి కూడా మనుమరుగవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఇన్‌చార్జ్ బద్దం మహిపాల్ రెడ్డి, నాయకులు దేవకీ వాసుదేవరావు, సన్నె ఉదయప్రతాప్, నాయుడు రాఘవరావు, ప్రవీణ్ కుమార్, దొంగల సత్యనారాయణ, నెల్లూరి బెనర్జీ, తాండ్ర వినోద్‌రావు, కె.శ్రీధర్‌రెడ్డి, గల్లా సత్యనారాయణ, నున్నా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ
చంద్రశేఖర్ తివారీ


