ప్లాస్టిక్‌పై సమరం
వ్యాపారులతో భేటీ
● ఖమ్మంలో ‘డిగ్రడేబుల్’ కవర్ల వినియోగం ● అన్నిచోట్ల విక్రయించేలా కేఎంసీ చర్యలు ● మొదటకేజీ చొప్పున ఉచితంగా పంపిణీ
ఖమ్మంమయూరిసెంటర్: పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ కవర్లను సమూలంగా నిర్మూలించేలా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా డిగ్రడేబుల్ (బయో కంపోస్ట్‌బుల్) సంచులు మాత్రమే వినియోగించేలా పర్యవేక్షణకు నడుం బిగించారు. నగర ప్రజలు వీటినే వినియోగించేలా, షాపుల్లో అమ్మేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఖమ్మంలోని ప్రముఖ హోటళ్లు, స్వీట్ షాపుల నిర్వాహకులు ఈ సంచులను వినియోగిస్తుండగా.. మిగతా వారిని కూడా ప్రోత్సహించేందుకు కార్యాచరణ రూపొందించారు.
ప్రత్యామ్నాయంగా..
ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా డిగ్రడేబుల్ (కంపోస్ట్‌బుల్) సంచులను తీసుకొచ్చేందుకు అధి కారులు కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు సింగిల్ యూజ్డ్ కవర్లు అమ్మే వ్యాపారులకు అవగాహన కల్పిస్తూ జరిమానా కూడా విధిస్తున్నా రు. ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను వెనక్కి పంపించి ప్రతీ వ్యాపారి డిగ్రడేబుల్ సంచులే విక్రయించాలని సూ చిస్తున్నారు. ఆపై జనవరి 1నుంచి ప్లాస్టిక్ కవర్లు అమ్మడం, వాడడంపై పూర్తిస్థాయిలో నిషేధం అమ ల్లోకి వస్తుందనే ప్రచారం చేస్తున్నారు. గడువు తర్వా త స్పందించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
మొక్కజొన్న స్టార్చ్‌తో తయారీ
ప్లాస్టిక్ కవర్లు పెట్రోలియం ఉత్పత్తుల నుంచి తయారై పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతుంటే, డిగ్రడేబుల్ కవర్లు పూర్తిగా పర్యావరణ అనుకూలమైనవిగా చెబుతున్నారు. ఇవి మొక్కజొన్న స్టార్చ్ నుంచి తీసిన గుజ్జు ద్వారా తయారవుతాయి. ప్రస్తుతానికి ఈ సంచులు హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ ద్వారా సరఫరా అవుతున్నాయి. ఈ కవర్లు భూమిలో వేసిన కేవలం రెండు నెలల్లో విచ్ఛిన్నమై చెత్త పేరుకుపోకుండా చేస్తాయి. అంతేకాక ఐదు కిలోల బరువు తీసుకెళ్లే సామర్ధ్యంతో ఉండడం విశేషం.
కేఎంసీ నుంచి పంపిణీ
వ్యాపారులు, ప్రజలకు డిగ్రడేబుల్ సంచులను పరి చయం చేసేలా కేఎంసీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కేఎంసీ తరఫున ప్రతీ దుకాణానికి కేజీ కవర్లను ఉచితంగా అందించాలని నిర్ణయించారు. డిగ్రడేబుల్ సంచులు కేజీ రూ.180 వరకు ఉండగా, అందరూ వీటిని వినియోగిస్తే ప్లాస్టిక్ సంచుల ద్వారా ఎదురయ్యే ప్రమాదం నుండి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.
నగరంలో ప్రతీ వ్యాపార సముదాయంలో డిగ్రడేబుల్ సంచులను మాత్రమే వినియోగించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మేయర్ పునుకొల్లు నీరజ సోమవారం కేఎంసీలో డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు, ఏఎంసీ అనిల్ కుమార్, పారిశుద్ద్య విభాగ అధికారులతో కలిసి డిగ్రడేబుల్ సంచుల తయారీ సంస్థల బాధ్యులతో భేటీ అయ్యారు. ప్రజలు వినియోగానికి తగిన విధంగా సంచులు తయారు చేసి సమకూర్చాలని సూచించారు.
ప్లాస్టిక్‌పై సమరం


