ఉన్నత విద్యకు తోడ్పాటు
పెరగనున్న ఆదరణ
కేజీబీవీల్లో విద్యార్థినులకు
పోటీ పరీక్షలపై ప్రత్యేక శిక్షణ
ఉమ్మడి జిల్లాలో ఆరు పాఠశాలలు
ఎంపిక
నెల రోజుల నుంచి కొనసాగుతున్న తరగతులు
భవిష్యత్‌కు పునాది..
కరకగూడెం: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో చదువుతున్న విద్యార్థినులు పోటీ పరీక్షల్లో రాణించేలా, రాష్ట్ర, జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీట్లు సాధించేలా రాష్ట్ర సమగ్ర శిక్షా విభాగం అధికారులు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థినుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 14 కేజీబీవీలు ఉండగా, వీటిలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 3,700 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ఖమ్మంలో జిల్లాలో 14 కేజీబీవీలు ఉండగా, 4,300 మంది విద్యనభ్యసిస్తున్నారు.
ఆరు కేజీబీవీల్లో శిక్షణ కేంద్రాలు
రాష్ట్ర సమగ్ర శిక్షా విభాగం ప్రతీ జిల్లా నుంచి మూడు కేజీబీవీలను యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ శిక్షణ కేంద్రాలు(వైఐఐఓఈ)గా ఎంపిక చేసింది. వీటిల్లో పోటీ పరీక్షలపై కోచింగ్ ఇస్తారు. ఉమ్మడి జిల్లాలో ఆరు కేజీబీవీలను ఎంపిక చేయగా, ఆన్‌లైన్ పద్ధతిలో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. భద్రాచలం, రఘునాథపాలెం పాఠశాలల్లో ఐఐటీ–జేఈఈ ప్రవేశ పరీక్షలపై, పాల్వంచ, ఖమ్మం రూరల్ కేజీబీవీల్లో నీట్, ఈఏపీసెట్, కూసుమంచి, చండ్రుగొండ పాఠశాలల్లో క్లాట్ తదితర ప్రవేశ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నారు. వారానికోసారి రాత పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఖాన్ అకాడమీ భాగస్వామ్యంతో బాలికలకు భౌతికశాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం వంటి సబ్జెక్ట్‌ల్లో ఆన్‌లైన్ ద్వారా శిక్షణ అందిస్తున్నారు. ఫిజిక్స్ వాలా సహకారంతో 9 నుంచి 12వ తరగతులకు ఫిజిక్స్, గణితంలలో ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.
మెరుగైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణలతో కేజీబీవీలకు ఆదరణ పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని కేజీబీవీల్లో శిక్షణ అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. కేజీబీవీల్లో 6వ తరగతి, ఇంటర్‌లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది.
కేజీబీవీ విద్యార్థినుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇంటర్ తర్వాత ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసింది. పేదరికం వల్ల ప్రతిభ కోల్పోకుండా ఈ కార్యక్రమం దోహదపడుతుంది. నెల రోజుల క్రితం శిక్షణ తరగతులు ప్రారంభం కాగా, పోటీ పరీక్షల సమయం వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
–అన్నామణి, జీసీడీఓ
ఉన్నత విద్యకు తోడ్పాటు
ఉన్నత విద్యకు తోడ్పాటు


