తుది విడతలో అడవి రామారం
ఆళ్లపల్లి మండలంలోని అడవి రామారం ఉమ్మడి జిల్లాలోనే అతి తక్కువ ఓటర్లు ఉన్న గ్రామ గ్రామపంచాయతీగా నిలిచింది. ఇక్కడ 107 మంది మాత్రమే జనాభా ఉంది. కేవలం 85 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 40 మంది, పురుషులు 45 మంది ఉన్నారు. సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించగా, నాలుగు వార్డుల్లో నాలుగు ఎస్టీలకే ఖరారు చేశారు. గ్రామ పంచాయతీకి తుది విడతలో ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి. అడవి రామారం పినపాక నియోజకవర్గంలో అత్యంత మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి రహదారి సౌకర్యం లేని కుగ్రామం. 2018లో అప్పటి ప్రభుత్వం తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా మర్కోడు గ్రామం నుంచి విడదీసి అడవి రామారాన్ని కొత్త పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఇక గతంలో దొంగతోగు గ్రామం రాష్ట్రంలోనే అతిచిన్న పంచాయతీగా నిలిచింది. ఇది గుండాల నుంచి విడిపోయి 2018లో కొత్తగా ఏర్పాటైంది. తాజా లెక్కల ప్రకారం దొంగతోగు గ్రామపంచాయతీ 88 మంది ఓటర్లతో ద్వితీయస్థానంలో నిలిచింది. ఇందులో పురుషులు 48మంది, మహిళలు 40 మంది ఉన్నారు.


