సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడి
ఓసారి చల్లిన మందు మరోసారి వద్దు
● మామిడిలో కొమ్మ కత్తిరింపులు కీలకం ● జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్ సూచనలు
ఖమ్మంవ్యవసాయం: మామిడి తోటల్లో కొమ్మ కత్తిరింపుల ద్వారా పంట త్వరగానే కాక ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎంవీ మధుసూదన్ తెలిపారు. ఈ మేరకు మామిడి సాగు చేస్తున్న రైతులు పూత, పిందె దశలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై ఆయన చేసిన సూచనలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం పూత దశ
జిల్లాలో 31,241 ఎకరాల మామిడి తోటలు ఉన్నా యి. ప్రస్తుతం చాలా చెట్లు పూత దశలో ఉన్నాయి. పూత ప్రారంభ దశలోనే ఇమిడాక్లోప్రిడ్ (0.5 మి.ల్లీ/లీ) లేదా థయోమిథాక్సాం (0.4 గ్రా/లీ) మందును నీటిలో కరిగే గంధకం (3 గ్రా/లీ)లో కలిపి పిచికారీ చేస్తే తేనెమంచు పురుగు, బూడిద తెగులును అరికట్టవచ్చు. ఈ మందులను రైతులు ఈపాటికే పిచికారీ చేసి ఉండాలి. లేకుంటే చీడపీడల కారణంగా పూత రాలిపోవడం లేదా పిందెలు సరిగా ఏర్పడకపోయే ప్రమాదముంది. కాగా, పూత పూర్తిగా వచ్చాక ఎలాంటి పురుగు మందులు పిచికారీ చేయొద్దు. అలా చేస్తే పిందెలు ఏర్పడడానికి సాయపడే తేనెటీగలు, కీటకాలు చనిపోతాయి.
పిందెలు ఏర్పడే దశలో చీడపీడల నివారణ
మామిడిలో చిన్న పిందెలు ఏర్పడే దశలో తేనెమంచు పురుగు, తామరపురుగులు, బూడిద తెగులు, మచ్చ తెగులు ఆశించే ప్రమాదముంది. ఈ సమస్య ల నివారణకు ఫిప్రోనిల్ (2 మి.లీ/లీ) లేదా రోగార్ (2 మి.లీ/లీ) పురుగు మందుల్లో ఒకటి, హెక్సా కొనజోల్ (2 మి.లీ/లీ) లేదా సాఫ్ (2 గ్రా/లీ) మందుల్లో ఒకదానికి ప్లానోఫిక్స్ అనే హార్మోన్ మందును (1 మి.లీని 4.5 లీటర్ల నీటిలో) కలిపి పిచికారీ చేయాలి. కాయలు నిమ్మకాయ సైజులో ఉన్నపుడు పాస్పోమిడాన్ (లీటరు నీటికి 2.5 మి.లీ) లేదా మెనోక్రోటోఫాస్ (లీటరు నీటికి 2 మి/లీ) మందుల్లో ఒక దానికి వేప సంబంధిత మందును (లీటరుకు 5మి.లీ) కలిపి పిచికారీ చేస్తే టెంక పురుగు, కాయ తొలిచే పురుగుతో పాటు పండు ఈగల బెడదను నివారించవచ్చు.
పిందెలు రాలకుండా నీటి తడులు
మామిడిలో ఏర్పడిన పిందెలు రాలిపోయే అవకాశముంది. నీటి ఎద్దడి, హార్మోన్లు, పోషక లోపాలవల్ల ఇలా జరుగుతుంటుంది. పిందెలు ఏర్పడే దశలో, తిరిగి 15–20 రోజుల వ్యవధిలో చెట్లకు 2–3 నీటి తడులు ఇవ్వాలి. తద్వారా పిందెలు రాలడం తగ్గడమే కాకుండా కాయలు పెద్దసైజులో నాణ్యతగా వస్తాయి. అలాగే, పిందెలు ఏర్పడి పెరిగే దశలో చెట్ల సైజు ఆధారంగా 500–100 గ్రా. యూరియా, 500–1000 గ్రా. పొటాష్ ఎరువులను రెండు కిలోల వేపపిండితో కలిపి ప్రతీ చెట్టుకూ వేయడం వల్ల కాయ సైజు పెరిగి నాణ్యమైన అధిక దిగుబడులు వస్తాయి.
చీడపీడల నివారణలో ఉత్తమ ఫలితాల కోసం రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి. వీలైనంత మేరకు ఒకసారి చల్లిన మందులను మరోసారి చల్లవద్దు. అలాచేస్తే పురుగులు మందులను తట్టుకొనే శక్తి సంపాదించే ప్రమాదముంది. ఇక మామిడిలో సింథటిక్ పైరిత్రాయిడ్ పురుగు మందులు వాడకపోవడమే మంచిది. విధిలేని పరిస్థితుల్లో, ఆఖరి అస్త్రంగానే తప్ప అలవాటుగా వీటిని ఉపయోగించడం మంచిది కాదు. ఇక పంటపై మందు చల్లే క్రమాన అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలి.


