ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా?
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
● ఈ అర్హతలు, పత్రాలు తప్పనిసరి ● నామినేషన్ వేళ సరిచూసుకోకుంటే తిప్పలే..
ఖమ్మంసహకారనగర్/సాక్షి నెట్‌వర్క్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రకియ గురువారం మొదలుకానుంది. ఈ నేపథ్యాన సర్పంచ్‌గా పోటీ చేయాలంటే ఎన్నికల కమిషన్ కొన్ని అర్హతలను నిర్ణయించింది. నామినేషన్ వేసే సమయాన వీటిని పరిగణనలోకి తీసుకోకపోతే తిరస్కరణకు గురయ్యే ప్రమాదముంది. అంతేకాక రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనాలో ప్రతీ అభ్యర్థి నేర చరిత్ర, ఆస్తులు, రుణాలు, విద్యార్హతలకు సంబంధించి ఇద్దరు సాక్షుల ద్వారా ధ్రువీకరించిన స్వీయ ప్రకటనను దాఖలు చేయాలి. కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరీ నుంచి కూడా పోటీ చేయొచ్చు. అలాగే, మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలే కాక అదే కేటగిరీలోని జనరల్ స్థానాల్లోనూ పోటీకి అవకాశం ఉంటుంది. ఇక జనరల్ కేటగిరీ సర్పంచ్ అభ్యర్థులు రూ.2 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ.వేయి నామినేషన్ సమయాన ధరావత్తు చెల్లిచాలి. వార్డు సభ్యులకు జనరల్ అభ్యర్థులైతే రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
అర్హతలు, పత్రాలు
సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలనుకునే వ్యక్తి సదరు గ్రామపంచాయతీ స్థానికుడై ఉండాలి. అందుకు నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. అలాగే, అభ్యర్థి పేరు పంచాయతీ ఓటరు జాబితాలో నమోదై ఉండాలి. నామినేషన్ దాఖలు సమయానికి వయసు 21 ఏళ్లు నిండడమే కాక ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. రిజర్వ్‌డ్ స్థానాల్లో పోటీ చేసేవారు అలాగే, నిబంధనల మేరకు ఎన్నికల ఖర్చు నిర్వహిస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి. నామినేషన్ పత్రం పార్ట్–1లో ప్రతిపాదకుని సంతకం, పార్ట్–2లో అభ్యర్థి సంతకం, పార్ట్–3లో కూడా అభ్యర్థి సంతకం, పార్ట్–4లో ఆర్‌ఓ సంతకం, పార్ట్–5 (రిజెక్టెడ్ నామినేషన్)లో కూడా ఆర్‌ఓ సంతకం ఉండాలి. పార్ట్–6(రిసిప్ట్)లో ఆర్‌ఓ సంతకం ఉండాలి. అఫిడవిట్‌లో ఇద్దరు సాక్షుల సంతకం, అభ్యర్థి సంతకం తప్పనిసరి. నామినేషన్ పత్రంతోపాటు స్వీయ ప్రకటన (అఫిడవిట్), అనుబంధం–5, డిపాజిట్ అమౌంట్, గ్రామపంచాయతీ నుంచి నోడ్యూ సర్టిఫికెట్, బ్యాంక్ నూతన ఖాతా పుస్తకం (గతంలో వినియోగించిన అకౌంట్ పుస్తకాన్నే జత చేస్తే సదరు అకౌంట్‌లో ఎలాంటి డబ్బు జమ అయినా ఎన్నికల ఖర్చుగా పరిగణిస్తారు), ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్‌లను జత చేసి ఎన్నికల అధికారికి అందజేయాలి.
అనర్హులు ఎవరంటే..
గ్రామ సేవకులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. గ్రామపంచాయతీకి వ్యక్తిగతంగా బకాయిపడిన వారు, బకాయిల చెల్లింపులకు నోటీసులు ఇచ్చినా చెల్లించిన వారిని అనర్హులుగా పరిగణిస్తారు. మతిస్థిమితం లేని వారు, బదిరులు, మూగవారు కూడా పోటీకి అనర్హులు. పౌరహక్కుల పరిరక్షణచట్టం–1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడిన వారు, గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణ ఒప్పందం చేసుకున్నా వారిని సైతం పోటీకి అనర్హులుగా పరిగణిస్తారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు లోపు పిల్లలు ఉన్న వారే పోటీ చేసేందుకు అర్హులని, అంతకంటే ఎక్కువ ఉంటే అనర్హులని 1994లో ఆంధ్రప్ర దేశ్ పంచాయతీరాజ్ చట్టం ద్వారా అమలు చేశా రు. నాడు జనాభా నియంత్రణ, ఆహార భద్రత, పేదరికనిర్మూలన, నిరుద్యోగం, అనార్యోగ సమస్యలు, ఆర్థిక అస్థిరత తదితర కారణాలతో ఈ నిబంధన తీసుకువచ్చారు. ప్రస్తుతం జననాల రేటు తగ్గిపోవటం, సంతాన సాఫల్యత క్షీణిస్తుండటంతో రాష్ట్రప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధన ను ఎత్తివేసింది. దీంతో 30 ఏళ్ల తర్వాత ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు కూడా పంచా యతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కలిగింది.


