ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీ ఎన్నికలు సాఫీగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణీ కుముదిని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం ఆమె సమీక్షించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రిజర్వేషన్లు, ఏ విడత ఎక్కడ పోలింగ్ ఉంటుంది, పోలింగ్ కేంద్రాల జియో లొకేషన్ వివరాలను టీ–పోల్ వెబ్‌సైట్, యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ఎంసీఎంసీ కమిటీ, మీడియా సెల్ ఏర్పాటు చేయాలని, రైతులు పంట డబ్బు తీసుకెళ్తే రశీదు వెంట పెట్టుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. వీసీ అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ అనుదీప్ పలు సూచనలు చేశారు. టీ– పోల్‌లో వివరాలు అప్ లోడ్ చేయడమే కాక మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్, ఓటరు జాబితాలను గ్రామంలోని మూడు ప్రదేశాల్లో అంటించాలని తెలిపారు. ప్రచార ర్యాలీలు, సభల నిర్వహణకు అనుమతి, నామినేషన్ కేంద్రాల వద్ద మార్కింగ్, బ్యాలెట్ పత్రాల ముద్రణ, కలెక్టరేట్‌లో మీడియా సెల్ ఏర్పాటుపై సూచనలు చేశారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీపీఓ ఆశాలత, డీఆర్‌డీఓ సన్యాసయ్య, ఆర్‌డీఓ నరసింహారావు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ ఎం.అపూర్వ పాల్గొన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్
రాణీకుముదిని


