ఆమెకు అక్షరమాల..
శిక్షణ ముమ్మరంగా సాగుతోంది..
ఇతరులపై ఆధారపడకుండా..
మహిళల అక్షరాస్యత పెంపే లక్ష్యంగా..
కేంద్ర ప్రభుతం ఆధ్వర్యాన ‘ఉల్లాస్’
డ్వాక్రా గ్రూపుల్లో నిరక్షరాస్యులకు బోధన
జిల్లాలో తొలిదశగా
50,564 మంది గుర్తింపు
కొణిజర్ల: మహిళలలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో కేంద్రం అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా 15ఏళ్లు నిండిన నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి వారికి కనీసం చదవడం, రాయడం నేర్పించాలనే లక్ష్యంతో కొత్త పథకం ఉల్లాస్ (అండర్‌స్టాడింగ్ ఆఫ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ సొసైటీ /యూఎల్‌ఎల్‌ఎస్) ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి వారికి చదవడం, రాయడం నేర్పించడంతో పాటు జీవన నైపుణ్యాలు, ప్రాథమిక విద్య, వృత్తి నైపుణ్యాలు, ఆర్థిక అక్షరాస్యత వంటి విషయాల్లో అవగాహన కల్పించనున్నారు. ఈ పథకాన్ని సెర్ప్, విద్యాశాఖ సంయుక్తంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించారు. మొదటి విడతగా డ్వాక్రా మహిళల్లో నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు ఏర్పాట్లు చేశారు. వీఓఏలకు, సీఆర్‌పీలకు శిక్షణ ఇచ్చారు. ప్రతీ పదిమంది సీ్త్రలకు ఒక వలంటీర్ చొప్పున నియమంచి.. వారికి కూడా శిక్షణ ఇచ్చారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ హాల్‌లలో నిరక్షరాస్య మహిళలకు అక్షరాలు నేర్పించేందుకు కార్యక్రమం చేపట్టారు.
పది మందికి ఒక వలంటీర్
జిల్లావ్యాప్తంగా మొత్తం 969 గ్రామ సమాఖ్యలుండగా 23,871 స్వయం సహాయక సంఘాలున్నాయి. వాటి లో 2, 41,512మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వారిలో 50,564మంది మహిళలను అక్షరాస్యులుగా తీర్చి దిద్దడానికి సర్వే చేశారు. ఇందుకు గాను 5,056 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. ప్రతి పదిమంది అభ్యాసకులకు ఒక వలంటీర్ చొప్పున అదే గ్రూపులో బాగా చదు వుకున్న ఓ మహిళను వలంటీర్‌గా ఎంపిక చేశారు. ఉల్లాస్‌లో ఉపయోగించే పుస్తకాలపై గత సెప్టెంబర్‌లో వలంటీర్లకు మండలాల వారీగా మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.
మండలానికి 1,500 మంది
ఉల్లాస్ శిక్షణ పొందిన వలంటీర్లు ప్రతిరోజూ వీరికి శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో మండలంలో మొత్తం 1,500 మందిని గుర్తించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించినారు. దశలవారీగా మహిళలను వందశాతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. తొలిదశలో పూర్తి నిరక్షరాస్యులైన మహిళలకు అక్షరాలు నేర్పించి కనీసం చదవడం, రాయడం నేర్పించడం చేయనున్నారు. అనంతరం పాఠశాల మానివేసిన యువతులను గుర్తించి వారిని ఓపెన్ టెన్త్‌లో చేర్పిండం, ఆ తర్వాత కళాశాల మాని వేసిన యువతులను గుర్తించి వారిని ఓపెన్ డిగ్రీలో చేర్పించి వారిని ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు ఉల్లాస్‌లో ప్రణాళికలు రూపొందించారు.
జిల్లాలో 5,056 మంది వలంటీర్లకు శిక్షణ ఇవ్వగా, వారు అన్ని హాబిటేషన్లలో నెల రోజులుగా నిరక్షరాస్యులకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే మొదటి వాచకం పూర్తి కావొచ్చింది. మహిళలకు చదువు వస్తే సంఘాలతో పాటు కుటుంబాలకు కూడా లాభం జరుగుతుంది. ‘అమ్మకు అక్షరమాల’పేరుతో చేపడుత్ను ఈ కార్యక్రమాన్ని నిత్యం పర్యవేక్షిస్తున్నాం. –అనిల్‌కుమార్,
డిప్యూటీ డైరక్టర్, వయోజనవిద్య
డ్వాక్రా మహిళల్లో పలువురికి చదువు రాక బ్యాంకు పనులకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. అలా జరగకుండా ఉల్లాస్‌లో భాగంగా చదవడం, రాయడం నేర్పించే ప్రక్రియ మొదలైంది. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతీ గ్రూపులో చదువుకున్న వారినే వలంటీర్‌గా ఎంపిక చేయడంతో అభ్యాసకులుగా శిక్షణ ఇస్తున్నారు. –బాదరబోయిన అరుణ,
వీఓ సభ్యురాలు, కొణిజర్ల
ఆమెకు అక్షరమాల..


