అవశేషాలు తగలబెడితే భూసారానికి ముప్పు
రఘునాథపాలెం: పంట కోతల అనంతరం పత్తి, వరి కొయ్యలను తగులబెట్టడం మానివేయాలని జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య రైతులకు సూచించారు. రఘునాథపాలెం మండలంలోని చింతగుర్తి, పరికలబోడుతండాల్లో బుధవారం పర్యటించిన ఆయన పంట అవశేషాలను కాలుస్తున్న రైతులకు అవగాహన కల్పించారు. మంట పెడితే భూమిలో పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించి భూసారం దెబ్బతింటుందని తెలిపారు. అలాకాకుండా పంట అవశేషాలను నేలలో కలియదున్నాలని సూచించారు. ఆ తర్వాత పత్తి, మిర్చి పంటలను పరిశీలించి సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ఏఈఓ బి.శిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.


