చిత్తడి నేలల గుర్తింపునకు చర్యలు
● పైలట్ ప్రాజెక్టుగా చింతకాని మండలంలో అమలు ● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
ఖమ్మంవ్యవసాయం: చిత్తడి నేలల(వెట్ ల్యాండ్) పరిరక్షణతో పర్యావరణానికి మేలు జరుగుతుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడి తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన వెట్‌ల్యాండ్ కమిటీ సమావేశంలో జిల్లా అటవీ అధికారి(డీఎఫ్‌ఓ) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 467 వెట్‌ల్యాండ్‌లు 8,911 హెక్టార్లలో ఉన్నాయని తెలిపారు. జల వనరులు, మత్స్యశాఖ పరిధిలో ఉన్న ఈ భూములను ధృవీకరించాలని సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి చిత్తడి నేలలపై సమగ్ర నివేదికలు అందించాలని, 6 నేలల లోపు నోటిఫై చేయాలని తెలిపారు. చింతకాని మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ముందస్తుగా ఈ మండలంలో చిత్తడి నేలలను గుర్తించి పరిరక్షణకు చర్యలు చేపట్టాలని తెలిపారు. నీటి వనరుల్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ సమీపంలో తడి భూములను గుర్తించాలని తెలిపారు. చింతకాని మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా గుర్తించిన నేపథ్యాన అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికలు అందిండచమే కాక ఆరు నెలల్లో నోటిఫై చేయాలని సూచించారు. కాగా, చిత్తడి నేలల గుర్తింపుతో భూమి యాజమాన్యం విషయంలో రైతులు ఆందోళన చెందొద్దని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు సన్యాసయ్య, డి.పుల్లయ్య, ఆశాలత, శివప్రసాద్, వెంకట్రామ్, నాగపద్మజ, ఎంవీ.మధుసూదన్, అనన్యతో పాటు మధిర, వైరా మున్సిపాలిటీల కమిషనర్లు సంపత్‌కుమార్, గురులింగం, కేఎంసీ ఉద్యాన అధికారి రాధిక తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్ లక్ష్యాలను చేరుకోవాలి
జిల్లాలో నిర్దేశించిన మేర ఆయిల్ పామ్ సాగయ్యేలా అధికారులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఉద్యానవన, సహకార శాఖ అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ పీఏసీఎస్‌ల పరిధిలో ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, తద్వారా లక్ష్యాన్ని చేరొచ్చని తెలిపారు. కాగా, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి గన్నీ బ్యాగులు రైతుల ఇళ్లకు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ఎక్కడైనా తేమ యంత్రాలు పనిచేయకుంటే వెనక్కి ఇవ్వాలని తెలిపారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ మాట్లాడగా జిల్లా సహకార అధికారి గంగాధర్, సెరికల్చర్ డీడీ ముత్యాలు పాల్గొన్నారు.


