జమలాపురం హుండీ ఆదాయం రూ.38.45లక్షలు
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. దేవాదాయ శాఖ పరిశీలకుడు టీ.వెంకటేశ్వర్లు, ఈఓ కె.జగన్మోహన్‌రావు ఆధ్వర్యాన లెక్కించగా 133 రోజులకు రూ.38,45,670 ఆదాయం నమోదైంది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మతో పాటు శ్రీసత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కేంద్రాల్లోనే మద్దతు ధర
వైరారూరల్: ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు కాకుండా ప్రభుత్వ కేంద్రాల్లో రైతులు విక్రయించాలని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి(డీసీఎస్‌ఓ) కె.చందన్‌కుమార్ సూచించారు. తద్వారా మద్దతు ధరతో పాటు సన్న ధాన్యమైతే బోనస్ కూడా వస్తుందని చెప్పారు. మండలంలోని పూసలపాడు సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. ప్రభుత్వ కేంద్రాల్లో నిర్దేశిత తేమ శాతం రాగానే కాంటా వేయించి మిల్లులకు ధాన్యం తరలిస్తున్నట్లు తెలిపారు. కాగా, ధాన్యం తేమశాతం పరీక్షించేలా సమకూర్చిన పాత, కొత్త మీటర్లలో తేడా వస్తోందని చెప్పగా, సమస్యను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం దాచాపురం వద్ద చెక్‌పోస్టును డీసీఎస్‌ఓ పరిశీలించారు. సివిల్ సప్లయీస్ డీటీ కిరణ్, సొసైటీ చైర్మన్ గాలి శ్రీనివాసరావు, కార్యదర్శి కృష్ణయ్య పాల్గొన్నారు.
ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉచిత వృత్తి శిక్షణ
భద్రాచలంటౌన్ : ఉమ్మడి జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉచిత వృత్తి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు నెలల పాటు ఉచిత భోజన, వసతి కల్పిస్తూ డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్‌గా శిక్షణ అందిస్తామని, ఆ తర్వాత ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు. ఎస్సెస్సీ, డిగ్రీ, ఐటీఐ పూర్తి చేసిన 20 – 30 ఏళ్ల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల నిరుద్యోగ గిరిజన యువత విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ జిరాక్స్ కాపీలతో ఈనెల 17వరకు ఐటీడీఏలోని భవిత సెల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పంటల కొనుగోళ్లపై
అధ్యయనం
● ఖమ్మం మార్కెట్‌ను సందర్శించిన శాలిగౌరారం కమిటీ
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పంటల కొనుగోళ్లకు అమలు చేస్తున్న విధానాలను నల్లగొండ జిల్లా శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ బృందం గురువారం అధ్యయనం చేసింది. మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లలో అమలు చేస్తున్న బిడ్డింగ్ విధానం, తద్వారా రైతులకు జరిగే ప్రయోజనాలనుఅధికారులు వివరించారు. అలాగే, మిర్చి కొనుగోళ్లలో జెండాపాట, ధర నిర్ణయం తదితర అంశాలను కూడా తెలుసుకున్నారు. శాలిగౌరారం మార్కెట్ చైర్మన్, వైస్‌చైర్మన్లు పాదూరి శంకర్‌రెడ్డి, నరిగ నరసింహ, సొసైటీ చైర్మన్ తాళ్లూరి మురళితో పాటు పాలకవర్గ సభ్యులు, మార్కెట్ ఉద్యోగులు పాల్గొన్నారు. వీరికి ఖమ్మం మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, తల్లాడ రమేష్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ అలీం, మార్కెట్ సహాయ కార్యదర్శి ఆంజనేయులు పలు అంశాలను వివరించారు.
జమలాపురం హుండీ ఆదాయం రూ.38.45లక్షలు


