‘వెల్‌నెస్’ సేవలకు బ్రేక్
● గదుల కొరతతో వైద్యం నిలిపివేత ● పలువురి ఆందోళనతో తిరిగి ప్రారంభం
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా జనరల్ ఆస్పత్రి ఆవరణలోని వెల్‌నెస్ సెంటర్ నిర్వహణకు తరచూ ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మందులు సక్రమంగా అందక, వైద్యులు అందుబాటులో లేకపోవడమే కాక సౌకర్యాలు లేమితో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పు డు వెల్‌నెస్ సెంటర్‌లోని ఓపీ, ఫిజియోథెరపీ గదుల ను సదరమ్ విభాగానికి కేటాయించటంతో సమస్య తీవ్రమైంది. ఈమేరకు ఆస్పత్రి సిబ్బంది బుధవారం ఆ గదుల్లోని ఫర్నీచర్, ఇతర సామగ్రిని ఇతర గదుల్లోకి తరలించగా వైద్యం అందించడం సాధ్యం కాదంటూ వెల్‌నెస్ సెంటర్ సిబ్బంది గురువారం సేవలు నిలిపివేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చిన వారు అసహనం వ్యక్తంచేస్తూ ఆందోళనకు దిగారు.
‘సదరమ్’ విస్తరణతో...
పెద్దాస్పత్రిలోని వెల్‌నెస్ సెంటర్‌లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్‌ఎస్)లో ఉన్న వారికి వైద్యసేవలు అందిస్తారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్య సేవలు అందించేలా ఈ విభాగం ఏర్పాటుచేయగా, మందుల సరఫరా, వైద్యులు, సిబ్బంది వేతనాల చెల్లింపు బాధ్యత ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చూస్తోంది. ఈమేరకు ఓపీ, రిజిస్ట్రేషన్, డ్రగ్ స్టోర్స్, ఫిజియోథెరఫీ, ల్యాబ్ కోసం ఆరు గదులు కేటాయించారు. అయితే, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా సదరమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ ఇటీవల ఆదేశించారు. దీంతో ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ సదరమ్ విభాగం విస్తరణకు నిర్ణయించి.. ఆ విభాగానికి ఆనుకుని ఉన్న వెల్‌నెస్ సెంటర్‌లోని రెండు గదులను కేటాయించారు. ఆపై అందులోని ఫర్నిచర్‌ను ఇతర గదుల్లో సర్దుబాటు చేయడంతో సమస్య ఏర్పడింది.
మా పరిస్థితి ఏమిటి?
సదరమ్ విభాగానికి రెండు గదులు కేటాయించగా, అందులోని ఫర్నిచర్, సామగ్రిని వెల్‌నెస్ సెంటర్‌లోని ఇతర గదుల్లో సర్దుబాటు చేయడంతో ఇరుకుగా మారాయి. వైద్యులు కూర్చోవడం, రిజిస్ట్రేషన్‌కు స్థలం లేదంటూ వైద్యులు, సిబ్బంది గురువారం సేవలు నిలిపివేశారు. ఈ విషయం తెలియక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. అంతేకాక సూపరింటెండెంట్ నరేందర్‌కు ఫిర్యాదు చేశారు. వెల్‌నెస్ సెంటర్‌లో సేవలు నామమాత్రంగానే అందుతుండగా, మందులు సైతం సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో ఉన్న గదుల్లోనే సేవలు కొనసాగించాలని వెల్‌నెస్ సెంటర్ వైద్యులను సూపరింటెండెంట్ ఆదేశించగా ఓపీ మొదలుపెట్టడంతో సమస్య పరిష్కారమైంది.
‘వెల్‌నెస్’ సేవలకు బ్రేక్


