వదిలేశారా ?! | - | Sakshi
Sakshi News home page

వదిలేశారా ?!

Nov 7 2025 7:31 AM | Updated on Nov 7 2025 7:31 AM

వదిలేశారా ?!

వదిలేశారా ?!

గేటు పెట్టి మరీ ఇసుక వ్యాపారం చేసిన ఘనులు పరిశీలనలతోనే సరిపెట్టిన అధికార యంత్రాంగం వరద తగ్గినా సర్వేపై మీనమేషాలు

‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు ఇసుక కొరత

వద్దనుకున్నారా..

సాక్షి ప్రతినిధి, ఖమ్మం/చింతకాని: చింతకాని మండలం చిన్నమండవలోని మున్నేటి లంక భూములు తమవేనంటూ ఫెన్సింగ్‌, గేటుపెట్టిన కొందరు ఇసుక వ్యాపారం చేశారు. ఈ భూముల్లో ఉన్న కొంత పట్టా భూమికి తోడు మరికొంత ఆక్రమించుకొని ఏళ్లుగా దందా కొనసాగించారు. ఉచితంగా ఇసుక తీసుకెళ్లే అవకాశం ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి సైతం వసూళ్లకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై ఇటీవల ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. ఇసుక రవాణా కోసం ఏటిలో వేసిన రోడ్డును తొలగించగా, ఉన్నతాధికారుల ఆదేశాలతో లంక భూములను సర్వే చేయాల్సి ఉంది. కానీ ఇటీవల భారీ వర్షాలతో వరద రావడంతో సర్వే చేయలేకపోతున్నామని చెప్పి... ఇప్పుడు వరద తగ్గినా అటువైపు చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.

67.28 ఎకరాల్లో లంక భూమి

ఎకరం, రెండెకరాలు కాదు.. ఏకంగా 67.28 ఎకరాల మేర లంక భూమి ఉంది. చింతకాని మండలం చిన్నమండవ మున్నేటి వైపు ఉన్న ముదిగొండ మండలం గంగాపురం రెవెన్యూ పరిధిలోని ఈ భూములపై మైనింగ్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు సర్వే చేయకపోవడం గమనార్హం. లంక భూముల్లో ఇసుక దందాకు తోడు ఆ భూములపై కొందరు అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాల తీసుకున్న విషయమై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై ఉన్నతాధికారులు స్పందించి లంక భూమి ఎంతమేర ఆక్రమణకు గురైంది, ఆక్రమణదారులెవరో తేల్చేలా సర్వే చేపట్టాలని మైనింగ్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలను ఆదేశించారు. దీంతో సెప్టెంబర్‌ 23న మున్నేటి లంక భూముల వద్దకు అధికారులు వచ్చినా వరద ఉధృతితో లోపలకు వెళ్లే మార్గం లేక వాయిదా వేశారు.

వరద తగ్గింది కదా?

మున్నేటికి వరద ఉధృతి తగ్గినా లంక భూముల సర్వేపై అధికారులు కావాలనే కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గంగాపురం రెవెన్యూ పరిధి 123 నుంచి 126వ సర్వేనంబర్‌లో ఉన్న లంక భూములపై అక్రమార్కులు పొందిన పట్టాదారు పాసుపుస్తకాలు, వాటి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, సాదాబైనామా దరఖాస్తులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ భూముల్లో ఇసుక దందాపై ఫిర్యాదులు రావడంతో నిర్లక్ష్యం వహించినట్లు భావిస్తూ చింతకాని తహసీల్దార్‌, ఎస్సైపై బదిలీ వేటు వేశారు. గంగాపురం గ్రామం పూర్తిగా కనుమరుగైనా సాగుకు యోగ్యం కాని భూములపై రిజిస్ట్రేషన్లు చేసి పాసుపుస్తకాలు ఎలా జారీ చేశారు, లంక భూములపై అక్రమార్కులు ఇప్పటివరకు పొందిన రైతు భరోసా ఎంత అనే అంశంపైనా విచారణ జరిపి పాసుపుస్తకాలను రద్దు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కబ్జా చెరలో చిన్నమండవ మున్నేటి లంక భూములు

లంక భూముల సర్వేలో అధికారులు తాత్సారం చేస్తుండడంతో చింతకాని, ముదిగొండ మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇసుక కొరతతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నమండవ మున్నేరు నుంచి ఇసుక రవాణా చేసుకుంటున్న లబ్ధిదారుల నుంచి సైతం అక్రమార్కులు డబ్బు వసూలు చేశారనే ఫిర్యాదుతో ఉన్నతాధికారులు రవాణాను నిలిపివేశారు. లంక భూములను సర్వే చేసి ఎంతమేర ఆక్రమణకు గురైంది, హక్కుదారులెవరో తేల్చేవరకు చిన్నమండవ రీచ్‌ నుంచి ఇసుక సరఫరా నిలిపివేయాలని ఆదేశించారు. కానీ సర్వేలో జాప్యంతో లబ్ధిదారులు ఇసుక కోసం ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈనేపథ్యాన జిల్లా అధికారులు స్పందించి లంక భూములపై సర్వే చేయించి అక్రమార్కులెవరో తేల్చడమే కాక ఇసుక తీసుకెళ్లే అవకాశం కల్పించాలని ఇందిరమ్మ లబ్దిదారుల కోరుతున్నారు. కాగా, సర్వే విషయమై చింతకాని తహసీల్దార్‌ బాబ్జీప్రసాద్‌ను వివరణ కోరగా జిల్లా మైనింగ్‌ అధికారులతో మాట్లాడి సర్వే పూర్తి చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement