
మధిర వాసుల ఆవేదన
● 15 మండలాలతో రాష్ట్రంలోనే పెద్దవిగా ఖమ్మం, కొత్తగూడెం ● మధిర డివిజన్ ఏర్పాటైతే అందరికీ సౌలభ్యం ● ఐదు మండలాలతో ఏర్పాటుకు అన్ని సానుకూలతలు
276 రెవెన్యూ గ్రామాలు
ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లో సింగరేణి, కామేపల్లి, రఘునాథపాలెం, ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, చింతకాని, ఖమ్మం అర్బన్, కొణిజర్ల, వైరా, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాలు ఉన్నాయి. ఈ డివిజన్ పరిధిలో 276 రెవెన్యూ గ్రామాలు, 416 గ్రామపంచాయతీలు ఉండగా, డివిజన్ విస్తీర్ణం 2,939 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఖమ్మం, పాలేరు, మధిర, వైరా నియోజకవర్గాల(ఏన్కూరు మినహా)తో కొనసాగుతున్న ఈ డివిజన్ వ్యాప్తంగా పర్యవేక్షణ ఖమ్మం కేంద్రంగా నిర్వహించడం యంత్రాంగానికి భారంలా మారింది. ప్రజల నుంచి అందే వినతుల పరిశీలన ఉద్యోగులకు ఇబ్బందిగా ఉంటోంది.
అతి తక్కువ మండలాలతో..
దూరాభారం, పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. అందులో అతి తక్కువ మండలాలతోనూ కొన్ని ఏర్పడ్డాయి. ఉట్నూరు డివిజన్ నాలుగు మండలాలతో, మెట్‌పల్లిలో మూడు మండలాలు, కోరుట్ల డివిజన్‌లో నాలుగు, తూఫ్రాన్‌లో ఐదు మండలాలు, పరకాల ఐదు మండలాలు, ఎల్లారెడ్డి నాలుగు మండలాలతో ఉన్నాయి. వీటితో పోలిస్తే ఐదు మండలాలతో కూడిన మధిర నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేస్తే ప్రజల ఇక్కట్లు తీరతాయి. రాష్ట్రంలో అతి పెద్ద రెవెన్యూ డివిజన్లుగా ఖమ్మం, కొత్తగూడెం 15మండలాలతో ఉన్నాయి. వీటి తర్వాత ఆదిలాబాద్, వనపర్తి, సూర్యాపేట రెవెన్యూ డివిజన్లలో 14 చొప్పున మండలాలను చేర్చారు.
50 కిలోమీటర్లకు పైగానే..
ఖమ్మం నుంచి మధిరకు 55 కి.మీ., ఎర్రుపాలెం 70 కి.మీ. దూరంలో ఉంటుంది. మధిర నియోజకవర్గ పరిధిలో మధిర, ఎర్రుపాలెం, ముదిగొండ, చింతకాని, బోనకల్ మండలాలకు గాను మధిర, ఎర్రుపాలెం డివిజన్ కేంద్రానికి దూరంగా ఉన్నాయి. అక్కడ తహసీల్దార్ కార్యాలయాల్లో పరిష్కారం కాని సమస్యల కోసం ప్రజలు ఖమ్మం ఆర్‌డీఓ కార్యాలయంతో పాటు కలెక్టరేట్‌కు వస్తున్నారు. ఈ ఐదు మండలాలతో మధిరలో డివిజన్ ఏర్పాటు చేస్తే అక్కడే సమస్యల పరిష్కారానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే, పాలన కూడా అధికారులకు సులభతరమవుతుంది.
సబ్ కలెక్టర్ స్థాయికి కల్లూరు
2016 అక్టోబర్ 11న కల్లూరు డివిజన్ ఏర్పాటైంది. ఈ డివిజన్‌లో కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, తల్లాడ, ఏన్కూరు మండలాలను చేర్చారు. మొత్తం 128 రెవెన్యూ గ్రామాలకు గాను 3,29,882 మంది జనాభా ఉన్నారు. ఈ ఏడాది జూలై 18న కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ కార్యాలయంగానూ అప్‌గ్రేడ్ కావడంతో ఐఏఎస్ అధికారి అజయ్‌యాదవ్ విధులు నిర్వర్తిస్తున్నారు. కల్లూరు డివిజన్ పరిధిలోని ఆరు మండలాలు గతంలో ఖమ్మం డివిజన్ పరిధిలోనే కొనసాగాయి. ప్రస్తుతం కల్లూరు డివిజన్ ఏర్పాటుతో అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తుండగా ఖమ్మంకు వచ్చే ఫిర్యాదులు తగ్గాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మధిర కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేయాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి.