● ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలపై ప్రత్యేక దృష్టి ● వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్షలో కలెక్టర్ అనుదీప్
ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్యశాఖపై శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది హాజరు ఆన్‌లైన్‌లోనే నమోదు చేయాలని తెలిపారు. ప్రసవ సమయాన తల్లి మరణాలకు సంబంధించి కేసులను పరిశీలిస్తే రెండో విడత పరీక్ష ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేయించుకున్నట్లు తేలిందన్నారు. ఈ నేపథ్యాన ఏడాది కాలంగా ప్రతీ ఆశా కార్యకర్త పరిధిలో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిన కేసులపై ఆరా తీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక నుంచి వైద్యాధికారులు తమ పరిధిలోని ఆశా కార్యకర్తలతో సమావేశమవుతూ గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవించేలా పర్యవేక్షించాలని, ఇందులో తప్పనిసరైతే తప్ప శస్త్రచికిత్సలు ఉండొద్దన్నారు. ఇక గర్భిణులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహించే ప్రైవేట్ ఆస్పత్రులపైనా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం పిల్లలకు వ్యాక్సినేషన్, ఎన్‌సీడీ సర్వే వివరాల ఆన్‌లైన్‌పై సూచనలు చేసిన కలెక్టర్... గత ఏడాది కంటే 58 శాతం డెంగీ కేసులు తగ్గడంపై అభినందించారు. ఇక టీబీ నిర్మూలన, తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ నిర్వహణపై సూచనలు చేశాక ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. డీఎంహెచ్‌ఓ బి.కళావతి బాయి, అధికారులు పాల్గొన్నారు.
కమిషనర్ అంత మంచోడిని కాదు...
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రతీ ఉద్యోగి విధులను బాధ్యతగా నిర్వర్తించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. తాను కమిషనర్ అంత మంచి వాడిని కానందున... విధుల్లో అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇదేసమయాన ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాలతో పైరవీలు చేయించినా పరిగణనలోకి తీసుకోనని తెలిపారు. కేఎంసీ కార్యాలయంలో కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి శుక్రవారం ఆయన పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్షించారు. నగరంలో పారిశుద్ధ్యం మరింత మెరుగుపడాలని, ఇందుకోసం సోమవారం నుంచి పది రోజులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోతే బాధ్యులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ డ్రైవ్ సమయాన జవాన్లు, సిబ్బందికి సెలవులు రద్దు చేయడమే కాక వార్డు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పనిచేయాలని తెలిపారు. హోటళ్లు, వాణిజ్య సంస్థల బాధ్యులు చెత్త బయట వేస్తే లైసెన్సు రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే, పదిహేను రోజుల్లోగా ప్రధాన రహదారిపై గుంతలు లేకుండా మరమ్మతులు చేయాలని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాస్, అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్, కేఎంసీ ఈఈ ఏ.కృష్ణలాల్, శానిటరీ సూపర్‌వైజర్ ఎం. సాంబయ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.