
భద్రాద్రి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
● ఖమ్మంలో టీటీడీ ఆలయానికి 13న స్థల పరిశీలన ● దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష
సాక్షిప్రతినిధి, ఖమ్మం: దేశంలోనే ప్రత్యేకత సంతరించుకున్న భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, అధికారులతో శుక్రవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భద్రాచలం ఆలయ విస్తరణ కోసం భూసేకరణ పూర్తయిందన్నారు. మాడవీధుల విస్తరణ, ప్రాకార గోడల నిర్మాణాలు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఆగమశాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా ఆర్కిటెక్ట్ రూపొందించిన డిజైన్లను ఖరారు చేసి పనులు వేగవంతం చేయాలన్నారు. భక్తులకు వసతి, రవాణా, పార్కింగ్, నీటి సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. భద్రాద్రి రామాలయం దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించేలా అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షించాలని అన్నారు.
టీటీడీ ఆధ్వర్యాన ఆలయ నిర్మాణం
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యాన ఖమ్మం నగరంలో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తుమ్మల తెలిపారు. ఇందుకోసం మూడు ప్రాంతాలను కలెక్టర్ టీటీడీ అధికారులకు ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ మేరకు వచ్చే సోమవారం టీటీడీ అధికారులు ఖమ్మంలో పరిశీలించి ఆలయ స్థలాన్ని ఖరారు చేస్తారని మంత్రి వెల్లడించారు.