
కాంగిరేసులో..
జిల్లా అధ్యక్షుడి నియామకంపై
అభిప్రాయ సేకరణ
పార్టీ నగర అధ్యక్షుడి ఎంపిక పైనా
దృష్టి
అందరికీ ఆమోదం,
పార్టీకి విధేయుడైన వ్యక్తికే పట్టం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు మొదలైంది. పార్టీలో సంస్థాగత మార్పులు చేసి కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానం నిర్ణయించింది. అలాగే నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవినీ భర్తీ చేయనున్నారు. ఈ రెండు పదవులపై శనివారం ఏఐసీసీ పరిశీలకుడు అభిప్రాయ సేకరణ చేశారు. మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్న వారికే డీసీసీ అధ్యక్ష పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఏఐసీసీ పరిశీలకుడు ఈనెల 19వ తేదీ వరకు నియోజకవర్గాల్లో పర్యటించి.. రోజుకో నియోజకవర్గంలోని రెండేసి బ్లాక్‌ల్లో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలతో పాటు దరఖాస్తులు స్వీకరిస్తారు.
ముందు డీసీసీ..
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలపడేలా సంస్థాగతంగా మార్పులకు అధిష్టానం నిర్ణయించింది. ఈమేరకు ప్రాంతాల వారీగా పరిశీలకులను నియమించింది. జిల్లా కాంగ్రెస్‌లోనూ సుదీర్ఘకాలంగా సంస్థాగత మార్పులు జరగలేదు. 2019 ఫిబ్రవరి 7న డీసీసీ అధ్యక్షుడిగా పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం నగర అధ్యక్షుడిగా జావేద్ నియమితులయ్యారు. ఆ తర్వాత కొన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులు మారినా ఇక్కడ ఆరేళ్లుగా వారే కొనసాగుతున్నారు. వీరి ఆధ్వర్యానే పార్టీ కార్యక్రమాలు నిర్వహించడమే కాక పలు ఎన్నికలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అధిష్టానం నిర్ణయంతో ఈ రెండు పదవుల భర్తీకి అభిప్రాయ సేకరణ చేస్తుండగా.. త్వరలోనే జిల్లా, మండల కమిటీలు, ఇతర నియామకాలు కూడా చేపట్టనున్నారు.
ఎవరైతే మంచిది?
జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి భర్తీపై ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ దృష్టి సారించారు. ఈమేరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఇదే క్రమాన శనివారం ఖమ్మంలో పార్టీ ముఖ్యనేతలు, మండల స్థాయి నేతలు, పీసీసీ సభ్యులతో సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టారు. దరఖాస్తు చేసుకున్న వారితో మాట్లాడి ‘మీకు ఎందుకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అనుకుంటున్నారు’ అన్న అంశంపై ఆరా తీశారు. దరఖాస్తు చేసుకోని నేతలను ఎవరైతే బాగుంటుందని సలహాలు అడిగారు. అలాగే సాయంత్రం కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో ఖమ్మం నగర అధ్యక్షుడి నియామకంపై చర్చించారు.
నియోజకవర్గాల వారీగా..
జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నియామకంపై ఖమ్మంలో సమావేశం ముగియగా.. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోనూ అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఈనెల 19వ తేదీ వరకు ఒక్కో నియోజకవర్గంలో రోజుకు రెండేసి సమావేశాలు నిర్వహించి డీసీసీ అధ్యక్షుడి నియామకంపై అభిప్రాయాలు సేకరిస్తారు. ఆపై నివేదిక తయారు చేసి అధిష్టానానికి పంపిస్తారు. వీటన్నింటినీ బేరీజు వేసుకుని అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. నివేదికలో మూడు నుంచి నాలుగు పేర్లు ఉంటే మంత్రులు, ఇతర నేతల అభిప్రాయాల ఆధారంగా ఎంపిక చేసే అవకాశముంది.
అర్హతలే గీటురాయి..
డీసీసీ అధ్యక్ష పదవితో పాటు ఇతర పదవులకు తగిన అర్హతలను ఆశావహులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. సుదీర్ఘకాలం పాటు పార్టీలో కొనసాగుతూ.. అంకితభావంతో పనిచేసిన వారిని పరిగణనలోకి తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. అంతేకాక పార్టీలో చేసిన కార్యక్రమాలు, పార్టీ అభివృద్ధిలో పాత్రను పరిశీలకులకు చెప్పగలిగి ఉండాలి. ఈ అర్హతలతో పాటు సామాజిక పరిస్థితుల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. కాంగ్రెస్‌లో సంస్థాగత పదవులను మూడేళ్లకోసారి భర్తీ చేయాల్సి ఉన్నా ఈసారి ఆరేళ్ల సమయం పట్టింది.
ఆరేళ్ల తర్వాత
సంస్థాగత నియామకాలు