
పేదల సంక్షేమమే లక్ష్యం
● రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి ● తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో పర్యటన
తిరుమలాయపాలెం/నేలకొండపల్లి : పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఆయన నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో పర్యటించారు. తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు –లకావత్ తండా, జోగులపాడు – తిలావత్ తండా బీటీ రోడ్లకు, జల్లేపల్లి, హైదర్‌సాయిపేట గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు, నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం – ముజ్జుగూడెం బీటీ రోడ్డుకు, పైనంపల్లిలో సీసీ రహదారులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉన్నా.. సంక్షేమ కార్యక్రమాల అమలును ఆపేది లేదన్నారు. తొమ్మిది నెలల్లోనే 25లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని తెలిపారు. సన్న ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తున్నామని, రూ.22,500కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఇంకా విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. పేదల పక్షపాతి అయిన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. నేలకొండపల్లికి చెందిన నాగామృత గ్రూప్–2లో ఎకై ్సజ్ ఎస్సై ఉద్యోగం సాధించగా ఆమెను అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకోబు, పీఆర్ ఈఈ మహేష్‌బాబు డీఈ వేణుగోపాల్, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, తిరుమలాయపాలెం తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ సిలార్‌సాహెబ్, ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, నాయకులు శాఖమూరి రమేష్, ఆర్.నరేష్‌రెడ్డి, కొడాలి గోవిందరావు, భద్రయ్య, గూడవల్లి రాంబ్రహ్మం, జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు, వేగినాటి లక్ష్మినర్సయ్య, బెల్లం శ్రీనివాస్, కొప్పుల అశోక్, మంగీలాల్ పాల్గొన్నారు.
నేడు మంత్రి పొంగులేటి పర్యటన..
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి చిన్న వెంకటగిరిలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నాక వరంగల్, సూర్యాపేట జిల్లాల పర్యటనకు బయలుదేరతారు.