
శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి పాదానికి, శ్రీస్వామి వారి విగ్రహానికి పంచామృతాభిషేకం చేశారు. శ్రీవారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నిత్య కల్యాణం గావించారు. ఆ తర్వాత శ్రీవారికి పల్లకీ సేవ చేయగా ఏపీ, తెలంగాణా రాష్ట్రాల భక్తులు దర్శించుకుని మొక్కులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కొత్తూరి జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక దర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఖమ్మంలో వేంకటేశ్వర స్వామి ఆలయం
● రేపు స్థలాలు పరిశీలించనున్న
టీటీడీ బృందం
ఖమ్మంఅర్బన్: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యాన నిర్మించనున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వినతితో టీటీడీ సానుకూలంగా స్పందించగా కొద్దిరోజుల క్రితం ఓ బృందం ఇక్కడ సానుకూలతలను పరిశీలించింది. ఆ తర్వాత 15వ డివిజన్ అల్లీపురం పరిధి హైదరాబాద్–దేవరపల్లి హైవే వెంట ధంసలాపురంలో సర్వే నంబర్లు 565, 563, 564, 565లో సుమారు 20 ఎకరాల భూమి అనుకూలంగా ఉందని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. అంతేకాక అదే గ్రామంలో సర్వే నంబర్ 408లో మరో 20 ఎకరాల భూమి కూడా ఉందని తెలిపారు. ఈ స్థలాలతో పాటు రఘునాథపాలెం బైపాస్‌లో నరిసింహులు గుట్ట భూమిని సైతం సోమవారం టీటీడీ బృందం పరిశీలించనుంది. ఆ తర్వాత స్థలాన్ని ఖరారు చేసి వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.
పీఎం డీడీకేవై
ప్రత్యక్ష ప్రసారం
వైరా/ఖమ్మంవ్యవసాయం: పీఎం ధన ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించగా.. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వైరా కేవీకేలో ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు రైతులతో ప్రధాని మోదీ ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) ధనసరి పుల్లయ్య మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, డీడీకేవైతో లబ్ధిని వివరించారు. అలాగే, వివిధ పంటల్లో తెగుళ్ల నివారణ, యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సుచరితాదేవి, మధిర, వైరా ఏడీఏలు విజయచంద్ర, కరుణశ్రీ, శాస్త్రవేత్తలు డాక్టర్ పావని, డాక్టర్ వై.చైతన్య, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. అలాగే, ఖమ్మం మార్కెట్ నుంచి చైర్మన్ యరగర్ల హన్మంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ అలీం, మార్కెట్ సహాయ కార్యదర్శి వీరాంజనేయులుతో పాటు పలువురు రైతులు ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు.

శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు