డైనోసార్‌.. స్టెగోడాన్‌ | - | Sakshi
Sakshi News home page

డైనోసార్‌.. స్టెగోడాన్‌

Oct 12 2025 6:41 AM | Updated on Oct 12 2025 6:41 AM

డైనోసార్‌.. స్టెగోడాన్‌

డైనోసార్‌.. స్టెగోడాన్‌

● సింగరేణి తవ్వకాల్లో లభించిన అవశేషాలు ● తెలంగాణ గడ్డపై నడయాడిన భారీ జంతువులు ● బిర్లా సైన్స్‌ సెంటర్‌లో ప్రత్యేక పెవిలియన్‌ లో ప్రదర్శన

● సింగరేణి తవ్వకాల్లో లభించిన అవశేషాలు ● తెలంగాణ గడ్డపై నడయాడిన భారీ జంతువులు ● బిర్లా సైన్స్‌ సెంటర్‌లో ప్రత్యేక పెవిలియన్‌ లో ప్రదర్శన

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సృష్టి పరిణామ క్రమంలో భూమిపై మంచుయుగం అంతరించాక రాక్షస బల్లులు (డైనోసార్లు), రాకాసి ఏనుగు(స్టెగోడాన్‌)ల వంటి భారీ జంతువులు వేర్వేరు కాలాల్లో ఆవిర్భవించాయి. ఈ జంతువులు క్రీస్తు పూర్వం మిలియన్‌ సంవత్సరాల క్రితమే భూమిపై సంచరించాయి. ఆ కాలంలో జీవించిన స్టెగోడాన్‌ జాతికి చెందిన ఏనుగులు, రాక్షస బల్లులు ప్రాణహిత–గోదావరి లోయ ప్రాంతంలో ఒకప్పుడు రాజ్యమేలాయి. అందుకు సంబంధించిన అవశేషాలు కొన్నేళ్లుగా వెలుగుచూస్తున్నాయి.

బొగ్గు తవ్వకాల్లో..

గోదావరి–ప్రాణహిత నది పరీవాహకంలో సింగరేణి సంస్థ వందేళ్లకు పైగా బొగ్గును వెలికితీస్తోంది. 2020–21లో పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఓపెన్‌ కాస్ట్‌ గనిలో ఓబీ (మట్టి) తొలగిస్తుండగా భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమైన ఐదు ఏనుగు కొమ్ములు లభించాయి. వీటిపై పరిశోధనలు జరిపి, క్రీస్తు పూర్వం 26 వేల నుంచి 23 వేల ఏళ్ల క్రితం భూమిపై సంచరించిన స్టెగోడాన్‌ జాతికి చెందిన ఏనుగుల అవశేషాలుగా తేల్చారు. ఈ ఏనుగు 13 అడుగుల ఎత్తుతో 13 టన్నుల బరువుతో ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వీటన్నింటినీ కొత్తగూడెంలోని ఎక్స్‌ఫ్లోరేషన్‌ డిపార్ట్‌మెంట్‌ పరిధిలో ఉన్న ఎపిక్‌ సెంటర్‌లోని మ్యూజియంలో భద్రపర్చారు.

గత ఏప్రిల్‌లో స్టెగోడాన్‌ అవశేషాలు

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో 2025 ఏప్రిల్‌లో స్టెగోడాన్‌ జాతికి చెందిన ఏనుగుల అవశేషాలు లభించాయి. ఈ విషయం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో అప్పటికే సింగరేణి ఆధీనంలో స్టెగోడాన్‌ ఏనుగుల అవశేషాలపై దృష్టి పడింది. తెలంగాణ గడ్డపై జీవించిన ప్రాచీన జీవజాలానికి సంబంధించిన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సింగరేణి–బిర్లా సైన్స్‌ సెంటర్లు జత కట్టాయి. అందులో భాగంగా బిర్లా సైన్స్‌ సెంటర్‌లో సింగరేణి పెవిలియన్‌ పేరుతో ప్రత్యేక ప్రదర్శనశాల ఏర్పాటుకు నిర్ణయించారు. సింగరేణి తవ్వకాల్లో లభించిన వందలాది పురాతన శిలాజాల్లో 50కి పైగా శిలాజాలను హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్‌ సెంటర్‌లో ప్రదర్శనకు పెట్టారు. అందులో స్టెగోడాన్‌ జాతికి చెందిన ఏనుగు దంతాలు కూడా ఉన్నాయి.

ఈ ప్రాంతంలోనే డైనోసార్లు

సింగరేణి బొగ్గు గనులు విస్తరించిన గోదావరి పరీవాహక ప్రాంతం ఒకప్పుడు భారీ జంతువులకు నెలవుగా ఉండేది. ప్రస్తుతం బిర్లా సైన్స్‌ ప్లానిటోరియంలోని డైనోసారియంలో కనిపించే డైనోసార్‌ ఆకృతికి సంబంధించిన అవశేషాలు మంచిర్యాల జిల్లా వేమనపల్లి దగ్గర అడవుల్లో 1974–80 మధ్య లభించాయి. అంతకు ముందు 1960, 70వ దశకాల్లో ఏటూరునాగారం ఏజెన్సీలో సైతం ప్రాచీనకాలానికి సంబంధించిన జంతుజాలం అవశేషాలు లభించాయి. వీటిని బిర్లా సైన్స్‌ సెంటర్‌, ఆర్కియాలజీ మ్యూజియం, వరంగల్‌, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) మ్యూజియం–బండ్లగూడలో భద్రపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement