
ఏసీపీ పోస్టు.. వెరీ హాట్!
● వైరా ఏసీపీ పోస్టుపై పలువురి దృష్టి ● పోటీలో ప్రధానంగా ముగ్గురు అధికారులు ● పది రోజుల క్రితం రిటైర్డ్ అయిన రెహమాన్
వైరా: వైరా అసిస్టెంట్ పోలీసు కమిషనర్ పోస్టుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ కార్యాలయ పరిధిలో ఎనిమిది పోలీస్‌స్టేషన్లు ఉండగా, గతంలో ఏసీపీగా విధులు నిర్వర్తించిన రెహమాన్ గత నెల 30న ఉద్యోగ విరమణ చేశారు. పది రోజులు దాటినా కొత్త అధికారిని నియమించకపోగా తాత్కాలికంగా కల్లూరు ఏసీపీ రఘుకు బాధ్యతలు అప్పగించారు. కానీ సత్తుపల్లి బాధ్యతలు చూస్తూనే మూడు నియోజకవర్గాల పరిధితో కూడిన వైరా ఏసీపీ బాధ్యతలు నిర్వర్తించడం కష్టమవుతున్నట్లు సమాచారం. అంతేకాక కేసుల విచారణలో కూడా జాప్యం జరుగుతోంది. ఈనేపథ్యాన ఏసీపీగా వచ్చేందుకు ముగ్గురు అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ఒకరికి అధికార పార్టీ నాయకుల ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఐదు నెలల క్రితమే బదిలీ!
వైరా ఏసీపీగా కొనసాగిన రెహమాన్ స్థానంలో హైదరాబాద్ పోలీస్ శిక్షణ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్.సారంగపాణిని నియమిస్తూ మే 7వ తేదీన ఉత్తర్వులు విడుదలయ్యాయి. కానీ తనకు అతి తక్కువ పదవీకాలం ఉన్నందున ఇక్కడే కొనసాగించాలని రెహమాన్ ఉన్నతాఽధికారులకు విన్నవించడంతో ఆ బదిలీని రద్దు చేశారు. దీంతో మూడేళ్ల మూడు నెలల పదవీ కాలం అనంతరం ఆయన గత నెల 30న రిటైర్డ్ అయ్యారు.
పోటీలో పలువురు
వైరా ఏసీపీ పరిధిలో వైరా, కొణిజర్ల, తల్లాడ, చింతకాని, బోనకల్, మధిరటౌన్, రూరల్, ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో నిత్యం ఐదు నుంచి పదిహేనుకు పైగా కేసులు నమోదవుతుండగా.. కొన్ని కేసులను ఏసీపీ స్థాయి అఽధికారే విచారించాల్సి ఉంటుంది. కానీ పది రోజులుగా పోస్టు ఖాళీగా ఉండడంతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లపై భారం పడుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు కొందరు భద్రాద్రి జిల్లాలో లూప్‌లైన్‌లో ఉన్న ఓ అధికారిని ఏసీపీగా తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయాన ఓ ఐపీఎస్ అఽధికారి, వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న మరో ఏసీపీ కూడా ఈ పోస్టుపై దృష్టి సారించినట్లు తెలిసింది. అయితే, అధికార పార్టీ నాయకులు సూచించిన అధికారికే పోస్టింగ్ దక్కుతుందనే చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా ఉన్నతాధికారులు స్పందించి ఏసీపీ పోస్టును త్వరగా భర్తీ చేస్తేనే కేసుల విచారణ, శాంతిభద్రతల పరిరక్షణ సులువవుతుందనే భావన వ్యక్తమవుతోంది.