
ఊరు డోర్నకల్... పేరు ఖమ్మం
● సండ్ర కలప అక్రమ రవాణాలో ఆనవాళ్లను గుర్తించిన అటవీ శాఖ ● మరింత లోతుగా విజిలెన్స్ విచారణ
ఖమ్మంవ్యవసాయం: తప్పుడు ధృవ పత్రాలతో సాధారణ కలప మాటున విలువైన సండ్ర కలపను రవాణా చేసిన వ్యవహారంలో రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల విచారణలో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. నేషనల్ ట్రాన్సిట్ పర్మిట్లతో ఖమ్మం జిల్లా చింతకాని అటవీ సెక్షన్ నుంచి తుమ్మ కలప సేకరించామని చెబుతూ ఉత్తరాది రాష్ట్రాలకు సండ్ర కలపను తరలించిన విషయం ఇటీవల బయపడింది. ఈ విషయమై ఖమ్మం డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ బృందాలు లోతుగా విచారణ చేపడుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయగా, సండ్ర కలప ఎక్కడి నుంచి సేకరించారనే విషయమై ఆరాతీశారు. ఈనేపథ్యాన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అటవీ సెక్షన్ పరిధి తోడేళ్లగూడెం, మన్నెగూడెం రెవెన్యూ గ్రామాల్లోని అసైన్డ్ భూముల్లో సండ్ర వృక్షాలను నరికినట్లు గుర్తించారు. నాలుగు నెలల్లో 24 పర్మిట్ల ద్వారా వందలాది క్యూబిక్ మెట్రిక్ టన్నుల సండ్ర కలపను అక్రమంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని పాన్ మసాలా కంపెనీలకు తరలించినట్లు తేల్చారు. సండ్ర కలపను డోర్నకల్ సెక్షన్ నుంచి తరలించినట్లు తేలడంతో విధుల్లో విఫలమైనట్లు భావించి అక్కడి ఉద్యోగులపై వేటు వేసే అవకాశముందని సమాచారం.