
రండీ.. టెండర్లు వేయండి
● మద్యం వ్యాపారులతో అధికారుల భేటీలు ● వ్యాపారం లాభసాటిగా ఉంటుందని భరోసా
ఖమ్మంక్రైం: ‘వైన్ షాపులకు టెండర్లు వేయండి.. లక్కు కలిసొచ్చి షాప్ దక్కితే వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి..’ అంటూ మద్యం వ్యాపారులకు ఎకై ్సజ్ అధికారులు భరోసా ఇస్తున్నారు! జిల్లాలో 116 వైన్స్‌కు గాను గతనెల 26వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఇప్పటివరకు 72దరఖాస్తులే నమోదయ్యాయి. ఈనెల 18వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ అధికారులు ముందు జాగ్రత్తగా మద్యం వ్యాపారంలో ఏళ్లుగా కొనసాగుతున్న వారితో సమావేశమవుతున్నట్లు తెలిసింది. దరఖాస్తుల పెంచడమే లక్ష్యంగా అధికారులు తమ వంతు ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు సమాచారం. గత ఎకై ్సజ్ పాలసీలో 4వేలకు పైగా దరఖాస్తులు నమోదవడంతో రూ.144కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి అంత కంటే ఎక్కువ ఆదాయం సాధించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నా సమయం తక్కువగా ఉండడం, ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈమేరకు సర్కిళ్ల వారీగానే కాక జిల్లా స్దాయి అధికారులు సైతం వ్యాపారులతో సమావేశమవుతూ వైన్స్‌కు టెండర్లు వేయాలని, డ్రా లో షాపులు వస్తే మంచి లాభాలు ఉంటాయని భరోసా కల్పిస్తున్నట్లు సమాచారం. గురువారం రాత్రి కూడా ఖమ్మంలో పలువురు వ్యాపార ప్రముఖులతో సమావేశమైనట్లు తెలిసింది. ఈక్రమాన దరఖాస్తు ధరను రూ.3లక్షలకు పెంచడంపై కొందరు వ్యాపారులు పెదవి విరిచినట్లు సమాచారం.
వచ్చే వారంపైనే ఆశలు
జిల్లాలో 116 వైన్స్‌కు ఇప్పటివరకు 72 దరఖాస్తులు అందగా, ఎకై ్సజ్ శాఖకు రూ.21.16 కోట్ల ఆదాయం సమకూరింది. నేడు, రేపు(శనివారం, ఆదివారం) వారాంతపు సెలవులు వచ్చాయి. ఆపై సోమవారం నుంచి వచ్చే శనివారం వరకే దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఈనేపథ్యాన వ్యాపారులు ముందుకొచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ తమ వంతు ప్రయత్నంగా జిల్లా వ్యాపారులతో పాటు గత పాలసీలో టెండర్లు వేసిన ఏపీ వ్యాపారులను సైతం సంప్రదిస్తున్నట్లు తెలిసింది. గత ఎకై ్సజ్ పాలసీలో ఆదాయంలో రాష్ట్రంలోనే రెండో స్థానం సాధించిన జిల్లాను ఈసారి కూడా ముందు వరుసలో నిలపాలనే భావనతో ఎకై ్సజ్ అధికారులు యత్నిస్తుండడం గమనార్హం.