నేడు మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

Oct 11 2025 9:24 AM | Updated on Oct 11 2025 9:24 AM

నేడు

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మంమయూరిసెంటర్‌/నేలకొండపల్లి: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. శనివా రం ఉదయం నేలకొండపల్లి మండలం ముజ్జు గూడెం, పైనంపల్లిల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, సాయంత్రం 4గంటలకు తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు, జోగులపాడు, జల్లేపల్లి, హైదర్‌సాయిపేటలోల్లో బీటీ, సీసీ రోడ్ల నిర్మానానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

డిప్లొమా కోర్సుల్లో

ప్రవేశానికి దరఖాస్తులు

ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో డిప్లొమా ఇన్‌ అనస్తీషియా టెక్నీషియన్‌, డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నీషియన్‌ కోర్సుల్లో ప్రవేశాలు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.శంకర్‌ తెలిపారు. రెండేళ్ల కాలపరిమితి కలిగిన ఈ కోర్సుల్లో 30చొప్పున సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంటర్‌ బైపీసీ చేసిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుందని, ఎంపీసీ, ఇతర కోర్సులు చేసిన వారిని తర్వాత పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 28వ తేదీలోగా https//tgpmb.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకుని, ప్రింట్‌ కాపీ, ధ్రువపత్రాలతో కాలేజీలో సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం https//gmckhammam.org వెబ్‌సైట్‌లో పరిశీలించాలని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మంమయూరిసెంటర్‌: మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎం.డీ.ముజాహిద్‌ తెలిపారు. జేఎల్‌ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీ 50 శాతం మార్కులతో పాటు బీఈడీలో 50 శాతం మార్కులు, టీజీటీ పోస్టులకు సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌, బీఈడీలో 50 శాతం మార్కులు, టెట్‌ తప్పనిసరి ఉండాలని చెప్పారు. మూడేళ్ల బోధన అనుభవం కలిగి జిల్లాకు చెందిన అభ్యర్థులు పూర్తి బయోడేటా, విద్యార్హతల సర్టిఫికెట్లు, జిరాక్స్‌లు, ఇతర పత్రాలతో సంబంధిత గురుకులాల్లో ఈనెల 13నుంచి 15వ తేదీ సాయంత్రం వరకు సమర్పించాలని సూచించారు. ప్రతిభ ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ రూపొందించాక ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. సత్తుపల్లి(బాలుర), నేలకొండపల్లి, ఖమ్మం బాలికల జూనియర్‌ కళాశాల, వైరా(బాలికలు)లో వివిధ సబ్జెక్టులు, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.

డబ్లింగ్‌ లైన్‌ పనుల పరిశీలన

కారేపల్లి: కారేపల్లి రైల్వేస్టేషన్‌ మీదుగా నిర్మిస్తున్న డబ్లింగ్‌ లైన్‌ పనులను దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం గోపాలకృష్ణ శుక్రవారం పరిశీలించారు. డోర్నకల్‌ రైల్వే జంక్షన్‌నుంచి కారేపల్లి మీదుగా కొత్తగూడెం(భద్రాచలం రోడ్డు) వరకు నిర్మించే లైన్‌ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. కాగా, లైన్‌ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారు పరిహారం చెల్లించాలని కోరగా డీఆర్‌ఎం సానుకూలంగా స్పందించారు. అనంతరం కారేపల్లి గ్రామస్తులు డీఆర్‌ఎంను కలిసి కరోనా సమయాన రద్దు చేసిన డోర్నకల్‌–భద్రాచలం రోడ్‌, మణుగూరు–కాజీపేట జంక్షన్‌ ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. అంతేకాక డోర్నకల్‌ నుంచి కొత్తగూడెం వరకు వెళ్లే అన్ని రైళ్లకు కారేపల్లిలో హాల్టింగ్‌ కల్పించాలని వినతిపత్రం ఇచ్చారు. గ్రామస్తులు సురేందర్‌రెడ్డి, సురేందర్‌ మణియార్‌, తురక నారాయణ, అజ్మీర బిచ్చ్యానాయక్‌, తొగర శ్రీను తదితరులు పాల్గొన్నారు.

13, 14న ఇంటర్వ్యూలు

ఖమ్మం సహకారనగర్‌: ప్రీ ప్రైమరీ తరగతుల బోధనకు ఎంపికచేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల భర్తీకి ఈనెల 13, 14వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఖమ్మం ఆర్డీఓ జి.నర్సింహారావు తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో ఈ నెల 13న మధ్యాహ్నం 2గంటల నుంచి, 14వ తేదీన ఉదయం 10గంటల నుంచి ఇంటర్వ్యూ లు ఉంటాయని వెల్లడించారు. గత నెల 27న మిగిలిపోయిన, హాజరుకాని అభ్యర్థులకు ఇప్పుడు ఇంటర్వ్యూ నిర్వహిస్తామని తెలిపారు.

నేడు మంత్రి పొంగులేటి పర్యటన
1
1/1

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement