
ఇరవై రోజుల్లోగా సీఎంఆర్ పూర్తి
ఖమ్మం సహకారనగర్: పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్(క్లస్టమ్ మిల్లింగ్ రైస్)ను ఇరవై రోజుల్లోగా మిల్లర్లు అందజేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పెండింగ్ ఉన్న 11,500 మెట్రిక్ టన్నులు రారైస్, 3,500 మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్‌ను ఇరవై పని దినాల్లో ఎఫ్‌సీఐకి అందించాలని తెలిపారు. ఇదే సమయాన ఎఫ్‌సీఐ అధికారులు గోదాంలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇక రబీ సీజన్‌కు సంబంధించి పెండింగ్ ఉన్న 42 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రోజుకు 600 మెట్రిక్ టన్నుల మేర సరఫరా చేయాలని తెలిపారు. రవాణా చార్జీల బిల్లులను మిల్లర్లు సమర్పిస్తే ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. కాగా, రేషన్‌షాపుల్లో పంపిణీ చేసే బియ్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించిన అదనపు కలెక్టర్.. ఖరీఫ్ ధాన్యం కేటాయింపుల కోసం తప్పనిసరి 10 శాతం బ్యాంకు గ్యారెంటీ సమర్పించాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, ఎఫ్‌సీఐ అధికారులు, మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వర్‌రావుతో పాటు పలువురు మిల్లర్లు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి