
సమస్యలపై పోరాడే అభ్యర్థులను గెలిపించండి
ఖమ్మంమయూరిసెంటర్: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాడే సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులతో బుధవారం ఆయన స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో పాలన వ్యవస్థ గాడి తప్పిందన్నారు. ప్రజాప్రతినిధులే లేకపోవడంతో పాలనలో శూన్యత ఏర్పడి, సమస్యలు పేరుకుపోయాయని తెలిపారు. ఇదే అవకాశంగా కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు ఇవ్వాల్సిన నిధులు నిలిపివేసిందన్నారు. కాగా, ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా భావసారూప్య పార్టీలు, లౌకిక, ప్రజాస్వామిక శక్తులు, వామపక్ష పార్టీలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి ముందుకెళ్తామని తమ్మినేని తెలిపారు. ఈమేరకు పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధమై సీపీఎం అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటారనే నమ్మకం కల్పించాలని సూచించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
తమ్మినేని వీరభద్రం